అంబటికి నో రిలీఫ్, లోకేశ్ మాటల్లో క్లియర్ ఇండికేషన్!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విషయంలో వెనక్కి తగ్గకూడదన్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అనే చర్చ జరుగుతోంది.;

Update: 2026-02-14 15:30 GMT

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విషయంలో వెనక్కి తగ్గకూడదన్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అనే చర్చ జరుగుతోంది. శాసనమండలి సాక్షిగా అంబటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వంలోని కీలక నేత, మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం చూస్తుంటే, రానున్న రోజుల్లో మాజీ మంత్రి అంబటి మరిన్ని చిక్కులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంబటిపై 52 కేసులు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దాదాపు 36 కేసులపై నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక మిగిలిన కేసులను ప్రభుత్వం అస్త్రంగా మార్చుకుని అంబటిని మరికొన్నాళ్లు జైలులో ఉంచేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి అంబటిని పోలీసులు గత నెల 31న అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 9న ఆయనకు బెయిలు వచ్చినా ప్రభుత్వం మరో కేసులో పీటీ వారెంటుపై జైలులో ఉంచింది. ఈ కేసులో కూడా అంబటి బెయిలు తెచ్చుకున్నారు. ఆ వెంటనే పోలీసులు సత్తెనపల్లిలో అక్రమంగా లాటరీ నిర్వహించారని మరో కేసు తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో అంబటికి మళ్లీ 14 రోజుల రిమాండ్ పడింది. ఇలా ప్రస్తుతానికి మాజీ మంత్రి అంబటి 15 రోజులు జైలులో ఉండాల్సివచ్చింది.

అయితే ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా, తగ్గేదేలే అన్నట్లు అంబటి వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో అంబటిపై వెనక్కి తగ్గకూడదన్నట్లు ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంబటిపై పెండింగు కేసులు అన్నీ బయటకు తీయాలని ప్రభుత్వం పోలీసులకు సూచించిందని అంటున్నారు. ఇదే సమయంలో మద్యం స్కాంకు అనుబంధంగా పేర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణంలో అంబటి పేరు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు లీకులు ఇస్తున్నాయని చెబుతున్నారు.

వైసీపీ హయాంలో మద్యం షాపులకు సరకు రవాణా చేసేందుకు ఓ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారని చెబుతున్నారు. ఈ సంస్థ నలుగురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చిందని, అందులో మాజీ మంత్రి అంబటి కూడా ఒకరని తాజాగా ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి మాజీ మంత్రి అంబటి మెడకు మద్యం ఉచ్చు కూడా బిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో అంబటి పాత్రకు సంబంధించిన ఏమైనా ఆధారాలు లభించాయా? లేదా? అన్న విషయాన్ని బయట పెట్టడంలేదని చెబుతున్నారు. దీంతో ఈ కేసుపై వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు తన తండ్రిని అవమానించిన అంబటిని తేలిగ్గా విడిచిపెట్టే పరిస్థితి లేదని మంత్రి నారా లోకేశ్ మండలిలో చేసిన ప్రకటన రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ హిట్ లిస్టులో ఉన్న వైసీపీ నేతలు అంతా ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లినట్లు గుర్తుచేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి కూడా ఎప్పటి నుంచో లోకేశ్ రెడ్ బుక్ లో ఉన్నారని, అయితే ఇప్పటివరకు సమయం రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సమయం వచ్చినందున అంబటిని వదిలిపెట్టొద్దు అన్నట్లు టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నేత చంద్రబాబును అవమానించేలా అంబటి వ్యాఖ్యలు చేసిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా తాజాగా తెరపైకి తెస్తోంది.

ఈ పరిణామాలను గమనిస్తుంటే, మాజీ మంత్రి అంబటికి ఇప్పట్లో రిలీఫ్ లభించే అవకాశం లేదని అంటున్నారు. మంత్రి లోకేశ్ మాటలలో ఇది స్పష్టమైందని అంటున్నారు. శాసనమండలిలోనే అంబటి విషయంలో కఠినంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడం చూస్తుంటే, తెరవెనుక ఇంకెంత పకడ్బందీగా పావులు కదుపుతున్నారో అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అంబటి చుట్టూ చోటుచేసుకుంటున్న రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News