పవన్ నీడలోనే పార్టీ నేతలు.. మంచిదేనా ..!
ఒక నాయకుడు ప్రజలకు చేరువ అయినా.. కాకపోయినా.. ఇబ్బంది లేదు. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం అలా కాదు కదా!.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నీడలోనే చాలా మంది ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికీ.. పవన్ ఇమేజ్‌పైనే ఆధారపడి ముందుకు సాగుతున్నారు. ఇది తప్పుకాదు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం కూడా లేదు. మరీ ముఖ్యంగా పవన్ మినహా 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారు. దీనిని కూడా వేలెత్తి చూపించక్కర్లేదు. కానీ.. నాయకుల మాట ఎలా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలకు స్వతంత్ర వైఖరి ఉండాలన్నది రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయం.
ఒక నాయకుడు ప్రజలకు చేరువ అయినా.. కాకపోయినా.. ఇబ్బంది లేదు. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం అలా కాదు కదా!. ప్రజలకు చేరువ కావాలి. ప్రజల అభిమానం సంపాయించుకోవాలి. నియోజకవర్గాల్లో అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. తద్వారా.. ప్రజల దగ్గర మంచి మార్కులు వేయించుకోవాలి. అలా కాకుండా.. కేవలం అధినేత ఫొటోతోనో.. ఆయన సెంటిమెంటుతోనో ఇంకా నెట్టుకువస్తామంటే.. ప్రజలు ఏమేరకు స్వాగతిస్తారన్నది ప్రశ్న. ఒకవేళ ఇదే నిజమైతే.. రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం కొనసాగి ఉండేది.
కానీ, ప్రజలు అలాకోరుకోవడం లేదు. ముందు పార్టీ అదినేతను... తర్వాత.. నేతలను కూడా నిశితంగానే పరిశీలిస్తున్నారు. ఈ ప్రభావం మనకు 2019, 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో జన సేన తరఫున ఎన్నికైన 17-18 మంది ఎమ్మెల్యేల్లో.. ఎంత మంది ప్రజల నుంచి మన్ననలు పొందుతు న్నారు? ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారన్నది ప్రశ్న. వీరిలోనూ మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, మంత్రి నాదెండ్ల మనోహర్ వంటి వారిని పక్కన పెడితే.. కొత్తవారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.
చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు కొత్తవారే కావడం గమనార్హం. వీరిలోనూ.. అసలు నియోజకవర్గానికి సంబంధం లేని వారు, నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు కూడా కావడం మరింత విశేషం. వీరంతా గత ఎన్నికల్లో జనసేన జెండా, పవన్ ఫొటోలను పట్టుకుని విజయం దక్కించుకున్నారు. ఈ 20 మాసాల వ్యవధిలో ప్రజలకు ఏమేరకు చేరువ అయ్యారు? అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. పైగా బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్, లోకం మాధవి, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాసరావు.. సహా మరికొందరు వివాదాలకు కేంద్రంగా మారారు. సో.. ఈ క్రమంలో జనసేన నాయకులు స్వతంత్రంగా ప్రజలకు చేరువ కావాల్సి ఉంది. లేకపోతే.. పార్టీ అయినా.. లేదా ప్రజలైనా వారిని పక్కన పెట్టేయడం ఖాయమని అంటున్నారు పరివీలకులు.