ఆపరేషన్ 362 : వ్యూహం.. విచ్ఛిన్నం! ప్రత్యర్థి పార్టీల ముక్కలు చెక్కలు చేస్తున్న మోదీ, షా
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ 362పై ఫోకస్ పెట్టింది. లోక్ సభలో 2/3 వంతు మెజార్టీ సాధించడమే లక్ష్యంగా విపక్షాలపై గురిపెట్టింది.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ 362పై ఫోకస్ పెట్టింది. లోక్ సభలో 2/3 వంతు మెజార్టీ సాధించడమే లక్ష్యంగా విపక్షాలపై గురిపెట్టింది. మహిళా రిజర్వేషన్ తోపాటు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేంద్ర పెద్దలు.. సభలో బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. దీంతో కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు సమూలంగా మారిపోతున్నాయి. ఆ రెండు బిల్లుల ఆమోదం కోసం గతంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే విపక్ష కూటమి సంయుక్తంగా అడ్డుకుని ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం చేపట్టిన రివర్స్ ఆపరేషన్ తో విపక్షంలోని ప్రధాన పార్టీలు అన్నీ చెల్లా చెదురైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రధానమైన విపక్ష పార్టీల్లో తిరుగుబాట్లు జోరందుకున్నాయని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టుకుంటున్నట్లు ప్రకటించగా, తాజాగా మహరాష్ట్రలోని రెండు ప్రధాన పార్టీల నుంచి అదేవిధమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే రెండు ముక్కలు అయిన శివసేన, ఎన్సీపీలో తాజాగా మరోసారి చీలిక వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. శివసేన (ఉద్దవ్) వర్గం నుంచి ఆరుగురు పార్లమెంటు సభ్యులు ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ పూర్తయ్యాక ఎన్సీపీ వంతు వస్తుందని అంటున్నారు.
ఈ పరిస్థితులను గమనిస్తే జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్న భావన వ్యక్తమవుతోందని అంటున్నారు. ఒకప్పుడు సంఖ్యాబలం కోసం మిత్రపక్షాలను బ్రతిమాలే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలతో ప్రతిపక్షాలను ఛిన్నాభిన్నం చేస్తూ పైచేయి సాధిస్తున్నారని అంటున్నారు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో కీలకమైన బిల్లుల ఆమోదం కోసం అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (362) సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293 మాత్రమే ఉన్నప్పటికీ, ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు మోదీ-షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహంతో కొద్దిరోజుల్లోనే కేంద్రంలోని ఎన్డీఏ బలం సునాయాశంగా 362 దాటిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు.
కొద్దిరోజులుగా బీజేపీ వ్యూహకర్తల ప్రణాళికలు చాలా పక్కాగా అమలు అవుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీయడం, అసంతృప్త నేతలను ఆకర్షించడం, పార్టీల్లో చీలికలు తీసుకురావడం ద్వారా ప్రత్యర్థులను బలహీనపరుస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు శిండే వర్గంలోకి చేరడం, టీఎంసీ నుంచి వేరుపడి ఎన్సీపీఐలో చేరిన 20 మంది ఎంపీల రాకతో ఎన్డీఏ బలం 317కు చేరుకుందని అంటున్నారు. ఇక ‘ఆపరేషన్ టైగర్’ వంటి వ్యూహాలతో శివసేనను దాటిన తర్వాత, ఇప్పుడు ఎన్సీపీ (శరద్ పవార్) వర్గంలోని ఎనిమిది మంది సభ్యులపై దృష్టి పెట్టారని వీరిలో కనీసం నలుగురు మద్దతునిచ్చినా ఎన్డీఏ బలం 321కు చేరుతుందని అంటున్నారు.
ఇక వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు స్వతంత్రుల్లో కనీసం ఐదుగురు ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండరనే అంచనాతో ఎన్డీఏ బలం 330కి చేరుకుంటుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అయినప్పటికీ, మూడింట రెండొంతుల మెజారిటీ మార్కును చేరుకోవడానికి ఇంకా 32 మంది ఎంపీల మద్దతు అవసరం ఉందని. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీలో చీలిక తీసుకురావడం, డీఎంకేతో 'డీల్' కుదుర్చుకోవడంపై బీజేపీ వ్యూహకర్తలు దృష్టి సారించారని చెబుతున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అసాధారణ రాజకీయ చాణక్యానికి తోడైన ఈ వ్యూహాలు ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ‘ప్రత్యర్థులను ఓడించడం కన్నా, వారిని రాజకీయంగా నిర్వీర్యం చేయడమే" ప్రధాని, హోంమంత్రి వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఇద్దరి వ్యూహాల ముందు ప్రత్యర్థులు చెల్లాచెదురవుతుండటంతో, విపక్షాల ఉనికినే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.