‘ఇండో’ పేరు తీసేసిన ట్రంప్ సర్కారు.. మనం మాత్రం వీధికి ట్రంప్ పేరు పెట్టుకోవటమా?
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీకి కాస్త ముందుగా అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం విస్మయానికి గురి చేసేలా మారింది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీకి కాస్త ముందుగా అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం విస్మయానికి గురి చేసేలా మారింది. అదే సమయంలో.. ట్రంప్ సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే.. అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారిలో మరే అధినేత చేయనన్న అవమానాలు ట్రంప్ చేశారని చెప్పాలి. అది.. ఇది అన్న తేడా లేకుండా భారతదేశాన్ని ఇరుకున పెట్టేలా.. భారతీయుల్ని అవమానించేలా ఆయన తీసుకున్న నిర్ణయాల జాబితాను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 2018లో ట్రంప్ 1.0 ప్రభుత్వ హయాంలో యూఎస్ ఇండో - పసిఫిక్ కమాండ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునే వేళలో.. హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి..ఈ కమాండ్ పేరును ఇండో - పసిఫిక్ కమాండ్ గా మార్చినట్లుగా 2018లో అప్పటి రక్షణ శాక కార్యదర్శి జేమ్స్ మాటిస్ వెల్లడించారు. కట్ చేస్తే.. తాజాగా దాని పేరును మళ్లీ మార్చిన సందర్భంగా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఎక్స్ లో ఒక పోస్టు చేస్తూ..‘‘యూఎస్ పసిఫిక్ కమాండ్ తిరిగి వచ్చింది’ అని పేర్కొనటం గమనార్హం.
వాత పెట్టి వెన్న రాసినట్లుగా.. పేరు మారినప్పటికి ఈ కమాండ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదని.. కమాండ్ ప్రాథమిక లక్ష్యంలో.. ప్రాంతీయ మిత్రదేశాలు.. భాగస్వాములతో కలిసి స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో కొనసాగాలన్న నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదన్న ఊకదంపుడు మాటల్ని దట్టించిన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇదంతా కూడా మోడీ - ట్రంప్ భేటీకి కాస్త ముందుగా ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
మోడీతో భేటీ సందర్భంగా ఆయన్ను పొగుడుతున్నట్లుగా నాలుగు మాటలు మాట్లాడిన ట్రంప్ మాటలకు మురిసిపోవటానికి ముందు.. భేటీకి ముందు తాము తీసుకున్న నిర్ణయం చూస్తే.. ‘‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ’’ అన్న పాత సామెత గుర్తుకు రావటం ఖాయం. భారతదేశాన్ని తక్కువ చేసేలా.. భారతీయుల్ని ఇబ్బందులకు గురి చేసేలా పదే పదే ట్రంప్ సర్కారు వ్యవహరించిన తీరును మర్చిపోలేం. భారతీయులే లక్ష్యంగా ట్రంప్ సర్కారు తెగబడిన ఉదంతాలెన్నో.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా వాడు ఇంతలా తెగబడుతున్నా.. మనం ఎదిరించలేం. గట్టిగా నోరెత్తి కడిగేయలేం. సరే.. పరిస్థితుల్ని అర్థం చేసుకుందామని సమాధానపడొచ్చు. దరిద్రం కాకుంటే.. హైదరాబాద్ లోని ఒక వీధికి ట్రంప్ ఎవెన్యూ అని పెట్టాల్సిన అసరమేంటి? అన్నది ప్రశ్న. మనకు కించిత్ సిగ్గు కూడా ఉండదా? అన్న ప్రశ్నను పలువురి నోట వినిపిస్తోంది.
ప్రపంచం దేశాల్లో ట్రంప్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. అలాంటి వేళ.. హైదరాబాద్ లోని నానక్ రాం గూడలో అమెరికా కాన్సులేట్ అనుకొని ఉన్న ప్రాంతానికి డొనాల్ట్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఎలాంటి మొహమాటం లేకుండా భారత్ పరువు తీసేలా.. సిగ్గుపడేలా నిర్ణయాలు తీసుకునే అధినేత పేరును మనం మాత్రం వీధికి పేరుగా పెట్టుకోవటం చూస్తే.. ఇంతకు మించిన బానిస మైండ్ సెట్ మరేం ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా సరే.. రేవంత్ సర్కారు ఈ నిర్ణయాన్ని పునరాలించుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.