ఈ 'రాజకీయాల'నే తెలంగాణ తిప్పికొట్టింది!
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ సమాజానికి కావాల్సింది.. రాజకీయం కాదు. అభివృద్ధి. పనితీరు. ఈ రెండు విషయాలనే తెలం గాణ ప్రజలు కోరుకుంటున్నారు. ``మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు పనులు కావాలి`` అనే చైతన్యం ప్రజల్లో గతంలో కనిపించింది. ఇప్పుడు కూడా కనిపిస్తోంది. అవి ఏవైనా కావొచ్చు.. ప్రజలకు కావాల్సింది.. రాజకీయం కాదు.. పనులే. ఇదే విషయంలో తప్పు చేశారో.. లేక.. అతికి పోయారో తెలియదు కానీ. గత సీఎం కేసీఆర్.. చేసిన ప్రకటనలు.. కేంద్రంపై యుద్ధాలు చేస్తానంటూ చేసిన ప్రతిజ్షలను ప్రజలు పక్కన పెట్టారు. ఫలితంగానే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.
మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యింది. ఈ కాలంలో కొంత వరకు సంక్షేమం చేతికి అందినా.. కీలకమైన అంశాల్లో.. గతం మాదిరిగానే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. కేంద్రానికి వార్నింగులు ఇస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా.. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కానీ, ప్రజలు ఇవి కోరుకుంటున్నారా? అంటే.. కానేకాదు. కేంద్రంతో ఏం చేస్తారో తెలియదు.. రాష్ట్రంలో పనులు చేయాలన్న ధోరణి నే ప్రదర్శిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా..
1) మెట్రో నిధులు: మెట్రో విస్తరణలో భాగంగా.. రుణం చేయాలని అనుకున్నామని.. కానీ, బీజేపీనే అడ్డు పడుతోందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ, ఇది రాజకీయ విమర్శలాగానే ఉంది తప్ప.. వాస్తవాన్ని ప్రజలకు వివరించడంలో ఎక్కడో తేడా కొడుతోందని.. పరిశీలకులు చెబుతున్నారు.
2) ధాన్యం కొనుగోలు: వడ్ల కొనుగోలు విషయంలో.. గతంలో కేసీఆర్ సైతం.. కేంద్రంతో లడాయి పెట్టుకు న్నారు. నేరుగా ఆయనే సీఎం హోదాలో ఉండి కూడా.. ధర్నాకు దిగారు. కానీ ఫలితం దక్కలేదు. ఇప్పు డు కూడా సేమ్ టు సేమ్.. అలానే జరుగుతోంది. కాకపోతే.. రేవంత్ ధర్నా చేయడం లేదు.. అంతే తేడా!. కానీ.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది? అనేది ప్రశ్న.
3) తుమ్మిడిహెట్టి: ఈ కీలక ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో చర్చించాలన్నది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కానీ.. అది సాకారం కావడం లేదు. ఇతర మార్గాలను అన్వేషించాల్సిన పెద్దలు.. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీని బూచిగా చూపించడం రాజకీయంగా కాంగ్రెస్‌కు అవసరమే అయినా.. ప్రజలకు కాదు. ఈ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
4) కేంద్రం సహకారం: కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తద్వారా నే రాష్ట్రంలో అనుకున్న విధంగా పనులు చేయలేక పోతున్నామని అంటున్నారు. కానీ, ఈ విషయాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం ఎలా ఉన్నా.. ప్రజల్లో సరైన సంకేతాలు ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్ కూడా.. ఇలానే ``కేంద్రం సహకరించడం లేదు. ఏం చేయమంటవ్?`` అని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకోలేదు. సో.. గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని.. కేంద్రాన్ని ఒప్పంచడమో.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమో చేయడమే.. ఇప్పుడు రేవంత్ ముందున్న కీలక విషయం.