అక్క తమ్ముళ్ల కోల్డ్ వార్.. సీటు కోసమేనా.. ?
రాజకీయాలు రాజకీయాలే!. ఎవరి అవసరం వారిది. ఈ క్రమంలో కుటుంబాల్లోనూ వివాదాలు కొనసాగడం కొత్తకాదు. తండ్రిని ఎదిరించిన తనయులు ఉన్నారు.
రాజకీయాలు రాజకీయాలే!. ఎవరి అవసరం వారిది. ఈ క్రమంలో కుటుంబాల్లోనూ వివాదాలు కొనసాగడం కొత్తకాదు. తండ్రిని ఎదిరించిన తనయులు ఉన్నారు. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వ్యవహారం కూడా దీనికి పరాకాష్ఠగా మారిందని అంటున్నారు. టీడీపీలోనే జరుగుతున్న చర్చను గమనిస్తే.. అక్క తమ్ముళ్ల మధ్య టికెట్ వివాదం పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భూమా అఖిల ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 2024 ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
అయితే.. ఆమె తమ్ముడు, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్నయించారని ప్రచారం జరుగుతోంది. ముందు.. నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇక్కడ ఆయనకు అవకాశం లేదన్న సంకేతాలు వచ్చాయి. ప్రస్తుత మంత్రి ఫరూక్ కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం రెడీ చేసుకుంటున్నారు. ఆయనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో అన్నీతానై పర్యటనలు కూడా చేస్తున్నారు.
దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డికి మరోమార్గం కానీ.. మరో నియోజకవర్గం కానీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అక్క సీటును ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోందని టీడీపీలోనే ఓ వర్గం చెబుతోంది. అయితే.. తన సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేని అఖిల ప్రియ.. తన సోదరుడికి నామినేటెడ్ పదవిని ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇది అంతగా వర్కవుట్ కాలేదు. అనంతర కాలంలో పలు వివాదాలు చుట్టుకున్నాయి. ఇవన్నీ.. తన తమ్ముడి కోసమే చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
దీనిలో ఒక్కటి కూడా వర్కవుట్ కాకపోగా.. ఇటీవల కుటుంబ సభ్యుల జోక్యాన్ని తగ్గించాలంటూ అధి ష్టానం హెచ్చరించింది. అంటే.. విఖ్యాత్ రెడ్డికి ఇప్పట్లో ప్రత్యేకంగా నియోజకవర్గం రిజర్వ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కసీటుపై కన్నేసిన విఖ్యాత రెడ్డి.. తనదైన శైలిలో తండ్రి తరఫు అనుచరులను తనకు అనుకూలంగా మార్చుకుని ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. దీనిపై ఎవరూ బహిరంగ ప్రకటన చేయడంలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతుండడం గమనార్హం. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందన్నది చూడాలి.