దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు
| ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతున్నా, రాజానగరంలో వైసీపీ సత్తా చాటింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాయకత్వంలో సీతానగరం, కోరుకొండ మండలాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. సీతానగరంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 18, కోరుకొండలో 23 స్థానాలకు 12 గెలుచుకుంది. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు ఈ ఫలితాలు షాక్‌గా మారాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సత్తా చాటారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన రాజానగరంలో పార్టీని విజయతీరాలకు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నా, రాజానగరం నియోజకవర్గంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచేలా వ్యూహ రచన చేసి సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉండగా, కడపటి వార్తలు అందేసరికి రెండు మండలాల్లో వైసీపీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ రెండు మండలాల అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకుందని అంటున్నారు.
రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ మండలాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ రెండు మండలాల్లోనూ మెజార్టీ మార్కును దాటడంతో ఆయా ఎంపీపీ స్థానాలు వైసీపీ పరమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతున్నా, రాజానగరంలో మాత్రం కూటమి స్పీడుకు బ్రేకులు పడటం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమర్త నాయకత్వంతోనే ఈ ఫలితాలు వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యేకి షాక్
రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు షాక్ ఇచ్చేలా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పావులు కదిపారు. గత ఎన్నికల్లో సుమారు 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ, నిస్పృహకు లోనుకాకుండా పనిచేశారని చెబుతున్నారు. రెండున్నరేళ్లుగా పార్టీని బలపరుస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే రాజా స్థానిక ఎన్నికల్లో అందుకు తగ్గ ఫలితాలను రుచిచూశారని చెబుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెండు మండలాల అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకున్న వైసీపీ, జడ్పీటీసీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి సీతానగరం జడ్పీటీసీగా పోటీచేయగా, ఆమెపై వైసీపీ అభ్యర్థి హరిబాబు ఆధిక్యంలో ఉండటం విశేషంగా చెబుతున్నారు.
హేమాహేమీలు మట్టికరిచిన వేళ
రాజానగరం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోనే రికార్డుగా చెబుతున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన హేమాహేమీలు ఎందరో కూటమి గాలిలో చేతులు ఎత్తేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి నుంచి చూస్తే వైసీపీలో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో సొంత కుటుంబ సభ్యులను కూడా గెలిపించుకునేందుకు చెమటోడ్చుతున్నారు. అయితే రాజానగరం నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే రాజా మాత్రం దీటుగా నిలబడి పార్టీని విజయతీరాలకు చేర్చారని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా, చాలా చోట్ల వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కానీ, రాజానగరంలో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యంతో దూసుకొచ్చింది. అంతేకాకుండా బలమైన కూటమి అభ్యర్థులకు షాక్ ఇచ్చిందని అంటున్నారు.