లైవ్ లో చెంపదెబ్బ.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
అభిమానులు ఆయనను భుజాలపై మోసుకుని వెళుతుండగా, ఓ వ్యక్తి అభిజిత్ ను ముందుకు లాగి చెంపపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. విద్యావ్యవస్థలో లోపాలను సరిదిద్దాలనే డిమాండ్ తోపాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని జైపూర్ లో సోమవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి అభిజిత్ దీప్కే హాజరయ్యారు. అభిమానులు ఆయనను భుజాలపై మోసుకుని వెళుతుండగా, ఓ వ్యక్తి అభిజిత్ ను ముందుకు లాగి చెంపపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన అభిజీత్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడిపై ప్రతిదాడి చేశారని అంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బందోబస్తులో ఉన్న పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేసి అదుపు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని నిరసనకారుల నుంచి రక్షించి, తమ అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల మద్దతు కూడగట్టుకున్న కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో విద్యావ్యవస్థ లోపాలపై సిజెపి నిర్వహించిన ఆందోళన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ నిరసనల స్ఫూర్తితో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లోనూ వరుస ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జైపూర్ వేదికగా జరిగిన ఆందోళనలో ఈ దాడి ఘటన జరగడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అభిజీత్ దీప్కేపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడిని సిజెపి నాయకులు, మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, ఈ పరిణామంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు కాక్రోచ్ పార్టీ రాజకీయ అజెండాను అమలు చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యావ్యవస్థలో లోపాలు సరిదిద్దాలనే కాక్రోచ్ పార్టీ డిమాండ్ ను అంతా సమర్థిస్తున్నా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతుండటంపై ఓ వర్గం ఆక్షేపిస్తోందని చెబుతున్నారు. కాగా, జైపూర్ ధర్నాలో అభిజిత్ పై దాడి చేసిన వ్యక్తి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దాడి చేయడానికి కారణాలు ఏంటి? అన్న వివరాలు ఆరా తీయనున్నారని అంటున్నారు.