ఆంధ్రోళ్లకు ఆంధ్రోళ్లమన్న భావన ఎక్కడ? పవన్ వేదనలో నిజమెంత?
ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరికి సాధ్యం కాదు. అందునా రాజకీయాల్లో ఉన్న వారు అలాంటి సాహసాలకు తెర తీసే ప్రయత్నం చేయరు.
ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరికి సాధ్యం కాదు. అందునా రాజకీయాల్లో ఉన్న వారు అలాంటి సాహసాలకు తెర తీసే ప్రయత్నం చేయరు. వాస్తవం చేదుగా ఉన్నప్పటికి.. ఆంధ్రోళ్లకు లేని ప్రాంతీయ అభిమానం గురించి ఏ రాజకీయ నేత మాట్లాడరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీద చూపించే అభిమానానికి భిన్నంగా ఆంధ్రోళ్ల తీరు కనిపిస్తుంటుంది. తెలంగాణ వారికి.. తెలంగాణ ఫీలింగ్.. తమిళులకు తమిళనాడు భావన.. కన్నడోళ్లకు ఉండే ఫీలింగ్స్ తో పోల్చినప్పుడు.. అలాంటి ప్రాంతీయ భావోద్వేగం పెద్దగా కనెక్టు కానీ రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ మాటకు వస్తే.. ఏపీలో తమను తాము ఆంధ్రోళ్లమన్న భావన కంటే.. మేం కోస్తావాళ్లం.. మేం పల్నాడువాళ్లం.. మేం గోదావరోళ్లం.. మేం రాయలసీమ వాళ్లం.. మేం ఉత్తరాంధ్ర వాళ్లం అనే భావనే ఎక్కువగా ఉంటుంది.
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికిఉన్న ప్రత్యేక గుర్తింపు.. ప్రాంతీయ సంస్క్రతి దీనికి కారణమని కొందరు బటర్ రాస్తారు. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఉత్తర.. దక్షిణ తెలంగాణలకు చెందిన ప్రజల తీరు భిన్నంగా ఉంటుంది. కానీ..వారికి ఆ భావన కంటే.. తాము తెలంగాణ వాళ్లమన్న ఫీలింగే ఎక్కువన్నది మర్చిపోకూడదు. ఇలా ఒక రాష్ట్రానికి.. ఆ రాష్ట్ర ప్రజలకు ఉండే భావోద్వేగ భావన గురించి మాట్లాడటంలో తప్పు లేదు. కానీ.. వాళ్లందరి ఉదాహరణ చెప్పి.. ఏపీ వాళ్లకు ఆంధ్రోళ్లమన్న భావన లేదన్న విషయాన్ని చెప్పే దమ్ము.. ధైర్యం ఏపీకి చెందిన నేతలకు తక్కువే.
అయితే.. అందుకు భిన్నంగా ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టిన వైనాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రదర్శించారు. తాజాగా తెలంగాణలో తనపై విరుచుకుపడుతున్న నేతల తీరుకు.. హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం తాను పెట్టిన ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ నీ అయ్య జాగీరు కాదన్న వ్యాఖ్యపై తెలంగాణకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు చెలరేగిపోతున్న వైనం తెలిసిందే.
ఇలాంటి వేళ.. అమరావతిలోని శాఖమూరులో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది. తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది. కానీ. ఆంధ్రా వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు. జై ఆంధ్రా అంటే ఇక్కడి వాళ్లు కనెక్టు కారు’’ అన్న కీలక వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడటానికి ఎలాంటి ముందస్తు ప్లాన్ లేదని స్పష్టం చేసిన పవన్.. తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా? అన్న మాటను ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పని కట్టుకు చేసిందని.. రేవంత్ చేశారని తాను అనుకోవటం లేదన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలన్న పవన్.. తనకు కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు కానీ చిలికి చిలికి గాలివానగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగి పన్నెండేళ్లకు పైనే పూర్తైన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ ను ఇట్టే రాజేసే రాజకీయ విధానాల్ని తెలంగాణలో చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఏపీలోని ప్రజలు తమను తాము ఆంధ్రోళ్లుగా ఐడెంటిఫై చేసుకోని వైనాన్ని పవన్ తన మాటలతో మరోసారి ప్రస్తావించారని చెప్పక తప్పదు.