బిగ్ బ్రేకింగ్... ఉప రాష్ట్రపతి దన్‌ఖడ్ రాజీనామా
ఉప రాష్ట్రపతి కాకమునుపు దన్‌ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. అక్కడి సీఎం మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు.;
సుదీర‍్ఘంగా నెల రోజుల పాటు సాగనున్న పార్లమెంటు సమావేశాలు ఇలా మొదలయ్యాయో లేదో.. జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు రాజ్యసభను చైర్మన్ హోదాలో నడిపించిన ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ దన్‌ఖడ్ అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా పదవి నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. 74 ఏళ్లదన్‌ఖడ్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 వరకు ఆయనకు పదవీ కాలం ఉంది. కానీ, రెండేళ్ల ముందుగానే వైదొలగారు.
ఉప రాష్ట్రపతి కాకమునుపు దన్‌ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. అక్కడి సీఎం మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. ఇక ఉపరాష్ట్రతిగానూ దన్‌ఖడ్ తనదైన ప్రత్యేకత చూపారు. కేరళలో తనకు పాఠాలు చెప్పిన మహిళా టీచర్ ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది 2023లో జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన దన్‌ఖడ్ న్యాయ వ్యవస్థతోనూ సంఘర్షణకు దిగారు.
జనతాదళ్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు జగ్‌దీప్ దన్‌ఖడ్. రాజస్థాన్‌కు చెందిన ఈయన 1951లో పుట్టారు. 1979లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకున్నారు. 1990 నుంచి సుప్రీంకోర్టులో రాజ్యాంగ సంబంధ కేసులను వాదించారు. 1989లో జనతాదళ్ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 1991లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1993లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో బీజేపీలో చేరారు. 2019 జూలై 20న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వెళ్లారు. 2022 వరకు పనిచేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఓ రకంగా మమతాతో వెర్బల్ వార్‌కు దిగారు. 2022 జూలైలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ‍్యతలు చేపట్టారు.
దన్‌ఖడ్‌కు ముందు వరకు ఉపరాష్ట్రపతిగా తెలుగు వారైన వెంకయ్యనాయుడు కొనసాగారు. ఓ దశలో వెంకయ్య కొనసాగింపు లేదా రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలన కూడా జరిగింది. ఈ రెండింటిలో ఏదీ సాకారం కాలేదు. చివరకు దన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి వరించింది. మరిప్పుడు దన్‌ఖడ్ స్థానంలో ఎవరిని నియమిస్తారో చూడాలి. మరోవైపు ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం బహుశా భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఏమో?..