వైసీపీ చేత‌లే.. ఆ పార్టీ కి శాప‌మా?

మ‌న చేత‌లే మ‌న‌కు మంచి తెస్తాయి.. అదే స‌మ‌యంలో ఆ చేతలు బాగోక‌పోతే.. శాపంగా కూడా మారుతుంది.;

Update: 2025-12-15 02:30 GMT

మ‌న చేత‌లే మ‌న‌కు మంచి తెస్తాయి.. అదే స‌మ‌యంలో ఆ చేతలు బాగోక‌పోతే.. శాపంగా కూడా మారుతుంది. వైసీపీ ప‌రిస్థితి ఇప్పుడు ఇలానే ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ చేత‌లు.. ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మంచి నాయ‌కుల‌ను దూరం చే సుకోవ‌డం.. బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు ఉన్న‌వారిని కూడా ప‌క్క‌న పెట్ట‌డంతో వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఇప్పుడు మీడియా ముందుకు వ‌స్తున్న వారంతా ఫేడ్ అయిపోతున్నార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

ఒక‌ప్పుడు ఒక ప‌ద్ధ‌తిగా, పార్టీ కోసం ప‌నిచేసిన వారు ఉన్నారు. కానీ, వారు.. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేవారు. సొంత పార్టీలో త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌ని తెలిస్తే.. వారు ఖ‌చ్చితంగా త‌ప్ప‌ని చెప్పేవారు. కానీ, వారు జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేదు. ఇలాంటి వారిలో గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి, ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, ప్ర‌సాద‌రావు, కోన ర‌ఘుప‌తి, మ‌ల్లాది విష్ణు వంటి వారు ఉన్నారు. అయితే, జ‌గ‌న్‌.. త‌న‌కు ప్ర‌శంస‌లు...ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు చేసుకున్న వారిని వెతికి మ‌రీ ప‌ట్టుకున్నారు. బూతులు మాట్లాడే వారంటే మ‌రీ ఇష్టంగా చేర‌దీశారు.

ఫ‌లితంగా వివాదాస్ప‌ద నాయ‌కులు చెల‌రేగిపోయారు. అసెంబ్లీలోనే తొడ‌గొట్టేవారు.. మీసాలు మెలేసే వారు.. పెరిగారు. ఇది అప్ప‌టిక‌ప్పుడు.. అధికారంలో ఉండ‌గా.. జ‌గ‌న్‌కు విన‌సొంపుగా అనిపించినా.. ప్ర‌జ‌లు మెచ్చ‌లేదు. ఇలాంటి వారి కార‌ణంగానే పార్టీ మొత్తం దెబ్బ‌తింది. అయితే.. ఇప్ప‌టికి ఈ విష‌యం తెలుసుకున్నా.. బ‌ల‌మైన నాయ‌కులు ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. త‌మ‌ను అప్ప‌ట్లో ప‌ట్టించుకోలే ద‌న్న వాద‌న‌ను వారు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అవాకులు, చ‌వాకులు పేలితే పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో వాయిస్ త‌గ్గిపోయింది. ఇక‌, ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేవారు జ‌గ‌న్‌ కు ఎలానూ న‌చ్చ‌డం లేదు. సో.. ఇప్పుడు మ‌ధ్యేమార్గంగా ఉన్న నాయ‌కుల కోసం వేట ప్రారంభించారు. కొత్త నేత‌ల‌ను రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున నాయ‌కుల‌ను ఎంపిక చేసే ప‌నిని ప్రారంభించారు. మ‌రి వీరేపాటి పార్టీకి ప‌నిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News