ముంబైలో మెస్సీ మ్యాజిక్... వాంఖెడేలో సచిన్ తో చారిత్రక భేటి!
ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో మెస్సీ తన అనువాదకురాలి సహాయంతో ప్రత్యేకంగా ముచ్చటించారు.;
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబైని తన మాయతో కట్టిపడేశాడు. కేవలం గంట వ్యవధిలో చారిత్రక వాంఖడే స్టేడియంలోని అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని పంచాడు. ఈ పర్యటనలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో మెస్సీ సమావేశం కావడం.. ఈ చారిత్రక భేటితో ముంబై ఈవెంట్ దేశవ్యాప్తంగా హైలెట్ గా నిలిచింది.
హైలెట్ గా మారిన జెర్సీ నంబర్ 10 బంధం
సాయంత్రం 5.30 గంటలకు వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టిన మెస్సీ, సుమారు గంట సేపు ఇక్కడి అభిమానులను అలరించాడు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో మెస్సీ తన అనువాదకురాలి సహాయంతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
సచిన్ తన సంతకంతో కూడిన భారత జట్టు జెర్సీని మెస్సీకి బహూకరించాడు. ఇద్దరి జెర్సీ నంబర్ 10 కావడంతో సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. సాకర్ లో మెస్సీ జెర్సీ నెంబర్ కూడా 10 కావడం విశేషం. సచిన్ ప్రసంగిస్తూ వాంఖడేలో తన మరుపురాని జ్ఞాపకాలలో మెస్సీతో సమావేశం కూడా ఒకటిగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. ఆ సమయంలో స్టేడియంలోని అభిమానులు ‘మెస్సీ, సచిన్, సువారెడజ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ పర్యటనలో మెస్సీతోపాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో కూడా పాల్గొన్నారు.
కోల్ కతాకు భిన్నంగా.. ప్రశాంతంగా ముగిసిన ముంబై ఈవెంట్
కోల్ కతాలో కేవలం 15 నిమిషాల పాటు కనిపించి తీవ్ర నిరాశకు గురిచేసిన అనుభవానికి భిన్నంగా ముంబైలో మెస్సీ అబిమానులతో ఎక్కువ సమయం గడిపాడు. కోల్ కతా, హైదరాబాద్ ల తర్వాత ముంబైలో పర్యటించిన మెస్సీ, ఇక్కడి ప్రశాంత వాతావరణంలో అభిమానులను అలరించగలిగాడు. మెస్సీ పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,పలువురు భారత ఫుట్ బాల్ క్రీడాకారులు, సినీ తారలు, ప్రముఖులు పాల్గొన్నారు.
సీఎం చేతుల మీదుగా‘ప్రాజెక్ట్ మహా దేవ ’ ప్రారంభం
ఈ వేదికపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘ప్రాజెక్ట్ మహాదేవ’ను అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని పాఠశాల స్థాయి ఫుట్ బాల్ క్రీడాకారులకు అండగా నిలిచి వారి కలలను సాకారం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సీఎం ఫడ్నవీస్ ఈ ప్రాజెక్ట్ వివరాలను మెస్సీకి వివరించి భవిష్యత్తులో ఇక్కడి నుంచే మెస్సీ లాంటి దిగ్గజాలు పుట్టుకురావాలని ఆకాంక్షించారు. ప్రాథమికంగా 16 మంది క్రీడాకారులను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు.
అభిమానుల కోసం మైదానంలో మెస్సీ ఉల్లాసం
షెడ్యూల్ కంటే ఆలస్యంగా వాంఖడేకు చేరుకున్నప్పటికీ మెస్సీ ఉత్సాహంగా కనిపించాడు. స్టేడియంలో ఇండియా ఎలెవన్, మిత్రా ఎలెవన్ మధ్య జరుగుతున్న సెలబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొన్న సునీల్ ఛెత్రి, రాహుల్ భేకే, బాలాదేవి లాంటి క్రీడాకారులతో కరచాలనం చేసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం స్టేడియం చుట్టూ తిరుగుతూ తన జ్ఞాపికలను అభిమానుల వైపు ఫుట్ బాల్స్ ను తన్నాడు. చిన్నారులతో కాసేపు ఫుట్ బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపాడు. వేదికపై మెస్సీని సీఎం ఫడ్నవీస్ ఆయన భార్య స్వాగతించారు. బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగణ్, డినో మోరియాలతో కలిసి ఫొటోలు దిగాడు.
సచిన్ తో సుధీర్ఘంగా ముచ్చటించిన తర్వాత మెస్సీ తన పర్యటనలో భాగంగా ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు స్టేడియం నుంచి బయలు దేరాడు. రేపు ఉదయం మెస్సీ ఢిల్లీకి వెళ్లనున్నాడు.