వైసీపీ చేసిన తప్పే బాబు చేస్తున్నారా ?

ఏ ప్రభుత్వానికి అయితే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అన్నది అయితే ఉంది.;

Update: 2025-12-15 03:50 GMT

అదేంటి వైసీపీ తప్పులు చేసింది అనేగా 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు అన్న మాట ఉంది. అలాంటిది వైసీపీ హయాంలో చేసిన తప్పులు బాబు చేస్తున్నారా అంటే అవును అంటున్నారు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి కూటమి తీరుని పూర్తిగా ఎండగట్టారు. ఆనాడు మేము చేసినది తప్పు అన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాగానే అదే తప్పు చేయడమేంటి అని నిలదీశారు.

రాబోయే ఆదాయాలతో :

ఏ ప్రభుత్వానికి అయితే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అన్నది అయితే ఉంది. వైసీపీ అయితే ఇలాగే చేసేది, మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టింది అని అంతా నాడు విమర్శించారు. ఇపుడు బాబు కూడా రాబోయే ఆదాయాలను చూపించి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అని బుగ్గన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

బాబు ఒప్పుకోవాల్సిందే :

సరిగ్గా ఇక్కడే ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవదీశారు. అదేంటి అంటే ఆనాడు తమ మీద గట్టిగా విమర్శలు చేసిన బాబు ఇపుడు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేము చేసినది కూడా ఒప్పు అని ఆయన ఒప్పుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మేము చేసింది తప్పు అనుకుంటే తాను కూడా తప్పు చేస్తున్నాను అని బాబు ఒప్పుకోవాలని బుగ్గన డిమాండ్ చేస్తున్నారు. జగన్ మీద ఆనాడు అబద్ధాలు ప్రచారం చేసి కూటమి లబ్ది పొందింది అని ఆయన ఘాటుగా విమర్శించారు.

స్పెషల్ మార్జిన్ తప్పు :

అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టిందని దానిని తప్పు అని చంద్రబాబు కూటమి నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు లేఖలు రాసిన వ్యక్తి కూడా ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని ఆయన ఎత్తి చూపారు. మరి ఆయన ఈ రోజున టీడీపీ కూటమి స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టి అప్పులు తెస్తూంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గోవాలో కంటే కూడా ఏపీలోనే మద్యం విచ్చలవిడిగా దొరుకొతందని బుగ్గన ఆరోపించారు. అయినా సరే ఎక్సైజ్ ఆదాయం చూస్తే మూడు శాతం మాత్రమే ఎందుకు పెరిగింది అని ఆయన నిలదీశారు. ఆ పెరిగిన డబ్బు అంతా ఎక్కడికి ఎవరి జేబుల్లోకి పోతోంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అప్పులు చూస్తే కనుక :

ఇక ఏపీలో అప్పులు చూస్తే కనుక గత 18 నెలలలోనే ఏకంగా 2.66 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని బుగ్గన చెబుతున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, దాంతో తెచ్చిన అప్పు ఎక్కడికి పోతోంది అని ఆయన ప్రశ్నించారు. ఈ లెక్కలు అన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ కి లింక్ చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. మొత్తానికి మాజీ ఆర్ధిక మంత్రి సంధించిన ఈ ప్రశ్నలకు కూటమి ఎలాంటి జవాబు చెబుతుందో చూడాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News