'ఓట్ల దొంగ -గద్దె దిగు': మోడీకి పెరిగిన సెగ
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ మే ప్రజల నుంచి ఓట్లను కొనుగోలు చేసిందన్నారు.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నుంచి మరింత సెగ పెరిగింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో `ఓట్ల దొంగ-గద్దె దిగు` కార్యక్రమంలో రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైదాన్ మొత్తం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో అవకతవకలకు పాల్పడుతూ.. వరుసగా అధికారం చేపడుతున్నారని.. ఓట్ల దొంగ.. అంటూ మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
మోడీ సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కార్నర్ చేస్తూ.. రాహుల్ గాంధీ సుమారు గంట సేపు పైనే మాట్లాడారు. బీజేపీతో కుమ్మ క్కయిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. కమిషన్‌లోని ప్రతి ఒక్కరూ మోడీకి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ.. ఆయన చెప్పినట్టే నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉంటామని చేస్తున్న ప్రమాణాలను కూడా తోసిపుచ్చుతూ.. బీజేపీకి సాగిలపడుతున్నారని ఎద్దేవా చేశారు. సత్యం-అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటంలో బీజేపీ వైపే కేంద్ర ఎన్నికల సంఘం నిలబడడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కూడా తీరని ద్రోహమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ మే ప్రజల నుంచి ఓట్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క మహిళకు 10 వేల రూపాయలు ముట్టజెబుతున్నా.. కేంద్ర ఎన్ని కల సంఘం నిద్ర పోయిందని దుయ్యబట్టారు. ఓట్లను దొంగిలించి గద్దెనెక్కడం బీజేపీకి అలవాటుగా మారిందన్న రాహుల్‌గాంధీ .. సత్యం వైపు తాము నిలబడ్డామని.. మోడీ సర్కారును కూల్చేస్తామని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో రాహుల్ గాంధీ.. రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
సత్యానికి విలువ లేదని ఆర్ ఎస్ ఎస్ భావిస్తోందని.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రపంచాన్ని, దేశాన్ని శాసించాలని చూస్తోం దని నిప్పులు చెరిగారు. కానీ. అదేసత్యంతో ప్రజల మన్ననలు పొంది.. మోడీ, ఆర్ ఎస్ ఎస్‌లకు తగిన బుద్ధి చెబుతామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఏం జరుగుతోందో.. ప్రజలు గమనించాలని కోరారు. ఓట్లను చోరీ చేయడం ద్వారా ప్రజల అభీష్టానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా బీజేపీ తూట్లు పొడుస్తోందన్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి దేశంలో దొంగలు పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా.. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ `ఓట్ చోరీ` యాత్రలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో తీర్మానం చేశారు. ఇదిలావుంటే.. సభకు వచ్చిన వారికి 10 పేజీలతో కూడిన రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యాంగ పుస్తకాలను రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ప్రదర్శించారు.