ఉగ్రవాదులకు చుక్కలు చూపిన ఈ సామాన్యుడు అసలుసిసలు రియల్ హీరో
రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే.. సాయం చేయటం తర్వాత.. అక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్లిపోదామా? అన్నట్లుగా వ్యవహరించే రోజుల్లో.. విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే.. ఒక ఉగ్రవాదిని టార్గెట్ చేయటం.. అతడి గన్ తో అతడికే గురి పెట్టిన వైనం విస్మయానికి గురి చేయటమే కాదు.. ఆ సామాన్యుడు ఇప్పుడు సిడ్నీలో రియల్ హీరోగా మారాడు.
సంచలనంగా మారిన సిడ్నీ ఉగ్ర కాల్పుల ఘటనలో స్థానికంగా పండ్ల దుకాణం నిర్వహించే 43 ఏళ్ల సామాన్యుడు అహ్మద్ అల్ అహ్మద్. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదిని నిలువరించటం.. ఈ క్రమంలో మరో ఉగ్రవాది జరిపిన కాల్పులకు తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు అతను సిడ్నీ హీరోగా మారాడు. ఆదివారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం ఆరున్నర గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సిడ్నీలోని బాండి బీచ్ లో పర్యాటకులు చిల్ అవుతున్నారు.
ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు మొదలు పెట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న 43 ఏళ్ల సామాన్యుడు మెరుపు వేగంతో ముందుకు దుమికి.. చెట్టు వెనుక నుంచి కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదిని గట్టిగా పట్టేసుకున్నాడు. అంతేకాదు.. అతడి చేతిలోని గన్ ను లాక్కొని తిరిగి అతడికే ఎక్కుపెట్టాడు. ఈ సమయంలో.. అక్కడికి కాస్త దూరంగా ఉన్న మరో ఉగ్రవాది అహ్మద్ ను టార్గెట్ చేసి కాల్పులు జరిపాడు. దీంతో అతను తీవ్రగాయాలతో కుప్పకూలాడు. సదరు ఉగ్రవాది అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
కాసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఒక ఉగ్రవాదిని కాల్చేయగా.. మరో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఉగ్రవాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడినయో వైరల్ గా మారింది. అందులో ప్రాణాలకు తెగించి మరీ ఉగ్రవాదిని ఎదుర్కొన్న సామాన్యుడు ఇప్పుడు రియల్ హీరో గా మారారు. ఉగ్ర కాల్పుల వేళ.. భయపడకుండా ఉగ్రవాదిని నిలువరించేందుకు సాహసించిన అహ్మద్ తీరు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.