బాబు...పవన్ విషయంలో జగన్ సడెన్ గా...?

మరి ఎందుకు జగన్ గట్టిగా టార్గెట్ చేయలేదు అన్నదే ఇపుడు అందరిలోనూ సందేహంగా ఒక చర్చగా మారుతోంది.;

Update: 2023-07-24 17:17 GMT

ఏపీ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఎంతలా విరుచుకు పడుతుంది అన్నది అందరికీ తెలిసిందే. ఏ ఒక్క చాన్స్ కూడా అసలు వదులుకోదు. మరో వైపు చూస్తే జగన్ మెల్లగా మొదలెట్టి ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి లో జరిగిన సభలో అల్టిమేట్ అన్నట్లుగా ఆ ఇద్దరి మీద కామెంట్స్ చేశారు. వారితో పాటు బాలయ్యను, లోకేష్ ని లాగారు.

మొత్తానికి జగన్ చేసిన తీవ్రాతి తీవ్రమైన విమర్శలుగానే వాటిని చూడాలి. ఆ తరువాత మూడు రోజుల వ్యవధిలో జరిగిన అమరావతి సభలో జగన్ నుంచి అలాంటి ఆటం బాంబుల లాంటి మాటల కోసం అటు వైసీపీ శ్రేణులు ఇటు రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే జగన్ మాత్రం చంద్రబాబు అండ్ కో అంటూ లైట్ గానే మాట్లాడారు. పవన్ని దత్తపుత్రుడు అని ఒక మాట అని ఊరుకున్నారు.

మరి ఎందుకు జగన్ ఇలా విపక్ష నేతల ను వదిలేశారు. వారిని ఎందుకు గట్టిగా టార్గెట్ చేయలేదు అన్నదే ఇపుడు అందరిలోనూ సందేహంగా ఒక చర్చగా మారుతోంది. జగన్ అమరావతి నడిబొడ్డున నిలబడి బిగ్ సౌండ్ చేస్తారని విపక్షాల మీద మాటల తూటాలే పేల్చుతారు అని అనుకున్నారు కానీ అలాంటివి ఏమీ జరగలేదు.

అయితే ఇదే సభ లో మరో చిత్రం చోటు చేసుకుంది. మంత్రి జోగి రమేష్ చంద్రబాబు, పవన్ని పట్టుకుని నానా మాటలు అన్నారు. పవన్ని అయితే ఏకంగా టార్గెట్ చేశారు. ఆ దశలో జగన్ చేతులు చూపించి మరీ మంత్రి జోగి రమేష్ ని వారించారు. అలా అనవద్దు అన్నదే ఆయన వారింపు వెనక ఉద్దేశ్యంగా ఉంది అంటున్నారు.

అంటే ఇక్కడ జగన్ ప్రత్యర్ధులను గట్టిగా విమర్శించలేదు, మంత్రి కూడా ధాటీ గా అంటూంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే ఎందుకిలా మార్పు అన్నదే చర్చగా ఉంది. అయితే జగన్ వారించినా జోగి రమేష్ అనాల్సినవి అన్నీ అనేసారు. ఆ తరువాత సీఎం జగన్ ఆయన కు ఏమి చెప్పి ఉంటారో అది వేరే విషయం కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఒక్కసారిగా మాటల దాడి ని పెంచిన జగన్ మళ్లీ ఇలా తగ్గిపోవడం వెనక ఏముంది, ఇది కూడా వ్యూహం ప్రకారమేనా అన్న చర్చ అయితే వస్తోంది.

అయితే వెంకటగిరి సభ లో జగన్ మాట్లాడిన మాటల తో మొత్తంగా రీ సౌండింగ్ వచ్చింది. టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. లోకేష్ అయితే దారుణంగా జగన్ మీద మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ ఏదైనా సభ ఉంటే మాత్రం వీటికి తప్పక బదులిస్తారు అనే అంటున్నారు. ఇలా జగన్ ఒకటి అంటే పది అనడానికి విపక్షం రెడీగా ఉంది.

ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఈ లెక్క అయితే తేలేది కానే కాదు, ఇక ఇలాంటి విమర్శల వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం లేదు అని అంటున్నారు దాంతోనే జగన్ తగ్గి ఉంటారా అన్నదే చూడాల్సి ఉంది. అయితే ఈ నెల 26న జగన్ అమలాపురం మీటింగ్ కి వెళ్తున్నారు. అక్కడ సభలో ఆయన ఏమి మాట్లాడుతారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా విపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఫ్లాష్ బ్యాక్స్ ని తవ్వుకుంటూ వారి మీద వీరూ వీరి మీద వారు విమర్శలు చేసుకుంటూ పోతే అవి జుగుప్సాకరంగా మారుతున్నాయి. అంతే కాదు ప్రజలు కూడా ఈ విమర్శలను ఏ కోశానా హర్షించే పరిస్థితి అయితే కనిపించడంలేదు అని అంటున్నారు. మరి అధికారం పక్షం నుంచే సహనం, సంయమనం పాటిస్తే ఈ దూషణ భూషణలు కొంత తగ్గుతాయా అన్న చర్చ కూడా ఉంది.

Tags:    

Similar News