ప్రభుత్వ సలహాదారుగా నెలకు రూ.4.50 లక్షలు!! అనూహ్య నిర్ణయం తీసుకున్న డాక్టర్ మంతెన

అదే సమయంలో తన వ్యక్తిగత నియమాలను సీఎం చంద్రబాబుకు వివరించిన డాక్టర్ మంతెన ప్రభుత్వ సలహాదారు పదవి వద్దని విన్నవించినట్లు సమాచారం.;

Update: 2026-01-25 07:30 GMT

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తన పదవిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనను గౌరవించి ఇచ్చిన పదవిపై సంతోషం వ్యక్తం చేసిన మంతెన ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పదవిపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు. డాక్టర్ మంతెన అభిప్రాయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ తిన్నారని, ఈ విషయంలో మంతెన అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. సీఎం పట్టుబడట్టడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ మంతెన కొన్ని నిబంధనలు, షరతలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు కలిశారు. సీఎం ఆహ్వానం మేరకు ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ మంతెన 35 ఏళ్లుగా అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అంతేకాకుండా ఆయన సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగు ప్రజలకు ప్రివెంటివ్ హెల్త్, యోగా, నాచురోపతి రంగాలలో డాక్టర్ మంతెనకు అనుభవం ఉంది ఆయన అపారమైన సేవలు, అనుభవాన్ని గుర్తించిన సీఎం ప్రజలకు ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తోందని, ఈ ప్రయత్నంలో డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు సలహాలు, సూచనలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల, యోగా, నాచురోపతి విభాగం నుంచి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించాలని ఆయన డాక్టర్ రాజును ఆహ్వానించారు. వెనువెంటనే డాక్టర్ మంతెనను ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకృతి వైద్యంతో ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు వ్యక్తిగతంగా కొన్ని నియమాలు విధించుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి అప్పటికప్పుడు తెలియజేయలేకపోయారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసి తనకు ఇచ్చిన గౌరవంపై ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో తన వ్యక్తిగత నియమాలను సీఎం చంద్రబాబుకు వివరించిన డాక్టర్ మంతెన ప్రభుత్వ సలహాదారు పదవి వద్దని విన్నవించినట్లు సమాచారం. అదే సమయంలో ప్రభుత్వానికి వెనుక నుంచి అవసరమైన సలహాలు సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే డాక్టర్ మంతెన వాదనను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఎలాంటి పదవి లేకుండా చెప్పే సలహాలకు విలువ ఉండదని, పదవి తీసుకుని ప్రజల ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందేనని సీఎం ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్లదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడికి డాక్టర్ మంతెన తలొగ్గినట్లు చెబుతున్నారు.

అయితే తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోలేనని చెబుతూనే సీఎం చంద్రబాబుపై ఉన్న గౌరవంతో సలహాదారు పదవి తీసుకోడానికి డాక్టర్ మంతెన అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ పదవి ద్వారా వచ్చే అన్నిరకాల ప్రయోజనాలను తిరస్కరించారని అంటున్నారు. అంటే కేవలం సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆ పదవి ద్వారా సంక్రమించే హోదా, వేతనాలు, రవాణా సదుపాయాలను తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటే నెలకు రూ.2 లక్షల జీతం, పీఏ, పీఎస్, ఓఎస్, డ్రైవర్ జీతాల కింద మరో రూ.70 వేలు అలవెన్సు, వెహికిల్ అలవెన్సు కింద రూ.60 వేలు, మొబైల్ ఫోన్ కనెక్షన్, దేశ, విదేశీ పర్యటన భత్యాలతో కలిపి నెలకు రూ.4.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సౌకర్యాలు అన్నింటిని వదులుకుని కేవలం సలహదారు పదవిలో కొనసాగడానికి మాత్రమే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అంగీకరించారని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

Tags:    

Similar News