150 ఏళ్ల వేడుకలకు 25 వేల అడుగుల జాతీయపతాకం
ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అందరిని ఆకట్టుకుంటోంది. కిలోమీటర్ల పరిధిలో జాతీయ పతాకాన్ని వందల సంఖ్యలో పట్టుకున్న విద్యార్థుల వైనం అలరించింది.;
భారీతనం అనే మాటకు అసలుసిసలు అర్థాన్ని చెప్పేలా కొన్ని కార్యక్రమాల్నినిర్వహిస్తుంటారు. అలాంటి వాటి గురించి ఎంత చెప్పినా.. వాటిని నేరుగా చూసినప్పుడు కలిగే అనుభూతి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ తరహా ఉదంతమే ఒకటి ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఒక విశేష కార్యక్రమానికి అంతే విశేషంగా.. మరెప్పటికి మర్చిపోలేని రీతిలో నిర్వహించిన కార్యక్రమం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మాట్లాడుకునేలా చేస్తోంది.
వందేమాతరం గీతానికి 150 ఏళ్ల వేడుకల్ని కొద్దికాలంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎవరికి వారు వారికి తోచిన రీతిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమం నభూతో.. అన్న రీతిలో సాగింది. పట్టణంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పాతికే వేల అడుగులతో జాతీయ పతాకాన్ని సిద్ధం చేసి ప్రదర్శించారు.
పాతిక వేల అడుగుల జాతీయ పతాకాన్ని తయారు చేయించే బాధ్యతను స్టూడెంట్ యునైటెడ్ నెట్ వర్కు సంస్థ అధ్యక్షుడు బసవ క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేయించి.. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అందరిని ఆకట్టుకుంటోంది. కిలోమీటర్ల పరిధిలో జాతీయ పతాకాన్ని వందల సంఖ్యలో పట్టుకున్న విద్యార్థుల వైనం అలరించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక శాఖా మంత్రి దుర్గేశ్ హాజరయ్యారు. వందేమాతరం స్ఫూర్తని కొనసాగించాల్సిన అవసరం అందరి బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. మంత్రిగారి మాటలు ఎలా ఉన్నా.. ఈ తరహా భారీ కార్యక్రమం మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించటంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమం అందరిలో కొత్త స్ఫూర్తిని రగిలించేలా చేసిందని చెప్పాలి.