తమిళ రాజకీయాల్లో జగన్.. ఆ సాహసం చేయగలరా?

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహారశైలి హాట్ టాపిక్ అవుతోంది.;

Update: 2026-03-03 06:31 GMT

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహారశైలి హాట్ టాపిక్ అవుతోంది. గత నెలలో చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం జగన్ దక్షిణాది రాజకీయ వర్గాలను ఆకర్షించారు. తమిళనాడుకు చెందిన దిగ్గజ నాయకులు, సెలబ్రెటీలతో జగన్ ఆ సందర్భంలో కలిసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అదేసమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో జగన్ కు ఉన్న సంబంధాలపై విస్తృత చర్చ జరిగింది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జగన్ రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలకు వైసీపీ మాజీ మంత్రి రోజా హాజరుకావడం పలు ఊహాగానాలకు తెరలేపిందని అంటున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు ఈ నెల 1న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా నేత ఆర్ కే రోజా హాజరుకావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఆకర్షించింది. ముఖ్యంగా ఏపీలో ఈ అంశంపై హాట్ డిబేట్ జరుగుతోంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఆమె మెట్టినిల్లు తమిళనాడు. రోజా భర్త సెల్వమణి సొంత ప్రాంతం తమిళనాడు. దీంతో రోజా డీఎంకే కార్యక్రమానికి హాజరుకావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో రోజా డీఎంకే అనుకూలంగా ప్రచారం చేస్తారని ఓ వర్గం మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రోజా ఖండిస్తున్నారు. తన పర్యటన పూర్తి వ్యక్తిగతమని, తమిళ రాజకీయాలతో తనకు పనిలేదని చెబుతున్నారు.

స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు రోజా వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో రాజకీయం ఏదీ లేదని ఆమె చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత జగన్ వ్యూహాం ఏమిటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. గత నెలలో వైఎస్ ఇంట పెళ్లి వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు సైతం స్టాలిన్ వచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికలలో స్టాలిన్ కు జగన్ మద్దతు ప్రకటిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే ఆధ్వర్యంలో ఒక కూటమి, అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇదే సమయంలో సినీ నటుడు విజయ్ కూడా తన పార్టీ టీవీకేను రేసులో తొలివరుసకు తీసుకువచ్చారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ సరిహద్దుల్లో ఉన్న తమిళ ప్రాంతంలో వైసీపీ ప్రభావం ఉంటుందనే అంచనాతో డీఎంకే అధినేత స్టాలిన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.

వైసీపీ నాయకత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడం, జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచే సామాజికవర్గాలను ఆకర్షించాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే స్టాలిన్ ప్రయత్నాలకు జగన్ రెడ్డి ఎంతవరకు సానుకూలంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి రేపుతోంది. తమిళనాడులో సీఎం స్టాలిన్ కు జగన్ దగ్గరైతే కేంద్రంలోని అధికార బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సివస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కోపం తెప్పించే పనిని జగన్ రెడ్డి చేస్తారా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెబుతున్నారు. బీజేపీతో తొలి నుంచి సామరస్యంగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం జగన్.. తమిళ ఎన్నికల కోసం బీజేపీతో సంబంధాలను దూరం చేసుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మాజీ మంత్రి రోజా చెన్నై పర్యటన రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపినట్లైందని అంటున్నారు.

Tags:    

Similar News