జగన్ ఇంటికి షర్మిల? వైఎస్ కుటుంబ రాజకీయాల్లో కీలక మలుపు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ రాజకీయం కీలక మలుపు తీసుకుంటుందా? కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు చూస్తే ఈ మార్పునకు ఎంతో సమయం లేదనే అంటున్నారు.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ రాజకీయం కీలక మలుపు తీసుకుంటుందా? కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు చూస్తే ఈ మార్పునకు ఎంతో సమయం లేదనే అంటున్నారు. కాకపోతే విభేదాలు ముగిసి మునుపటిలా మళ్లీ సహృద్భావ వాతావరణం చిగురిస్తుందా? లేక తమ రాజకీయ అవసరాల వరకే పరిమితం అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఇండి కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఎంపీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతో రిటైర్డ్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాల తరఫున పోటీ చేస్తున్నారు.
తెలుగు వారైన సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అదే సమయంలోపార్టీ ఆదేశాల ప్రకారం ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఏపీలో అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన, విపక్షం వైసీపీ అధికార ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో మొత్తం 35 ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రాంతీయ, భాషా సెంటిమెంటుతో ఏపీ, తెలంగాణలలో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఓట్లను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
ముఖ్యంగా ఏపీలో 35 ఓట్లు ఉండటం, బీజేపీ మినహాయిస్తే మిగిలిన మూడు పార్టీలకు కలిపి 30 మంది సభ్యుల బలం ఉండటంతో ఏపీసీసీ చీఫ్ షర్మిల రంగంలోకి దిగారని అంటున్నారు. పార్టీ హైకమాండు సూచనలతో మూడు పార్టీల అధినేతలను కలవాలని షర్మిల భావిస్తున్నారని, ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ ను కలవాలని షర్మిల డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ అవసరమే అయినా జగన్ ను షర్మిల కలవాలని అనుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గత కొంత కాలంగా జగన్-షర్మిల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం పనిచేసిన షర్మిల ఆ తర్వాత తనదారి తాను చూసుకున్నారు. ఇక ఏపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన షర్మిల తన సోదరుడు జగన్ టార్గెట్ గా అనేక రాజకీయ విమర్శలు చేశారు. ప్రధానంగా జగన్ రాజకీయ ప్రత్యర్థులకు మించిన స్థాయిలో షర్మిల విమర్శలు చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఆయన పరాజయానికి షర్మిల కూడా ఓ కారణంగా చెబుతారు. జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత కూడా షర్మిల వెనక్కి తగ్గలేదు. అధికారపక్షం కన్నా, తన అన్నయ్యే టార్గెట్ గా షర్మిల వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో షర్మిల విమర్శలను జగన్ కూడా తప్పుబట్టారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తన అసంతృప్తిని జగన్ వెల్లగక్కారు. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు కోరుతూ షర్మిల వెళతారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎన్డీఏ, ఇండి కూటమిలుగా పార్టీలు విడిపోగా, వైసీపీ రెండు కూటములకు సమదూరం పాటిస్తోంది. అయితే అవసరమైనప్పుడల్లా బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కు ముందే బీజేపీ అధిష్టానం మాజీ సీఎం జగన్ ను సంప్రదించింది. ఆయన మద్దతు కోరింది. అయితే ఇప్పుడు తెలుగు సెంటిమెంటుతో కాంగ్రెస్ రంగంలోకి దింపడం, జగన్ సోదరినే రాయభారానికి పంపడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. షర్మిలకు జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడు ఇద్దరి కలయిక ఉంటుంది..? షర్మిల అభ్యర్థనపై జగన్ మనసు మార్చుకుంటారా? అనే ప్రశ్నలు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి.