ఆఫ్టర్ వన్ ఇయర్ : గోదావరి తీరాన్ని టచ్ చేస్తున్న జగన్

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక వ్యూహం ప్రకారమే ఏపీలోని పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తున్నారు.;

Update: 2025-07-31 20:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక వ్యూహం ప్రకారమే ఏపీలోని పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలకు జైలు యాత్రలు అని కూటమి నేతలు ఎద్దేవా చేయవచ్చు. పరామర్శ యాత్రలు అని వైసీపీ నేతలు సర్దిచెప్పుకోవచ్చు. కానీ జగన్ మాత్రం పక్కా ప్లాన్ తోనే ఈ టూర్లు పెట్టుకున్నారు అన్నది అవగతమవుతోంది. ఏపీలో జగన్ వివిధ ప్రాంతాలలో టూర్లు వేయడం గమనించాలి. రాయలసీమలో శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నుంచి సాగుతూ గుంటూరు జిల్లా తెనాలి, రెంటపాళ్ళ, ప్రకాశం జిల్లా పొదిలి, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తాజాగా నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటించారు.

తరువాత అడుగు అక్కడే :

ఇవన్నీ కూడా పరామర్శ యాత్రలు, మధ్యలో పార్టీ నాయకుల ఓదార్పు యాత్రలుగా కూడా ఉన్నాయి. ఇలా ఏపీలో మూడు కీలక ప్రాంతాలలో జగన్ పర్యటనలు పెట్టుకున్నారు. ఇక తాజాగా చూస్తే జగన్ గోదావరి లో పల్స్ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానికి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు తోడు అయింది. తమ పార్టీ ఎంపీని రాజమండ్రీ జైలులో పెట్టారు అని జగన్ ఇప్పటికే మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులు చెరిగారు కూడా. ఇపుడు ఆయన రాజమండ్రికి రాబోతున్నారు.

ఒక్క సీటు రాని చోట :

రాజమండ్రి గోదావరి జిల్లా గుండె కాయగా చెబుతారు. గోదావరి తీరం సందళ్ళకు రాజకీయ హడావుడికి కూడా పెట్టింది పేరుగా ఉంటుంది. ఇక్కడ పల్స్ ఎలా ఉన్నాయన్నది ఇపుడు వైసీపీకి ముఖ్యం. ఎందుకంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ రాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా ఏమీ కాకుండా ఓటర్లు చేశారు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్లు ఉన్న గోదావరి తీరంలో కూటమి స్ట్రాంగ్ గా ఉంది అన్నది ఒక అభిప్రాయంగా ఉంది. సహజంగానే టీడీపీకి ఇక్కడ బలం ఉంది. దానికి జట్టుగా జనసేన చేరింది.

వ్యతిరేకత ఎంత పాలు :

జనసేన పార్టీ వెనక ఒక బలమైన సామాజిక వర్గం ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలసి స్వీప్ చేసి పారేశాయి. వైసీపీకి కూటమి ఇచ్చిన భారీ షాక్ ఇక్కడే. దాంతో జగన్ గోదావరి తీరంలో ఏ విధంగా ముందుకు సాగుతారు అన్న చర్చ సాగుతున్న వేళ ఆయన రాజమండ్రీకి వస్తున్నారు. ఆయన ఆగస్టు 5న జగన్ రాజమండ్రి వచ్చి జైలులో ఉన్న మిధున్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇక జగన్ పర్యటన ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.

ఏమి జరగనుంది :

యధాప్రకారం జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు యధావిధంగా కొనసాగబోతున్నాయి. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను మోహరిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసమీకరణలు చేయవద్దు అని పోలీసులు ఒక వైపు చెబుతున్నా చాలా చోట్ల జగన్ వెళ్ళినపుడు వైసీపీ వారు ఆదేశాలను లెక్క చేయడం లేదు. మరి రాజమండ్రీలో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. మరో వైపు వైసీపీకి గ్రౌండ్ లెవెల్ లో బలం ఎలా ఉంది, సంస్థాగతంగా ఆ పార్టీ రీ యాక్టివ్ అయిందా లేదా అన్నది కూడా ఈ పర్యటన తెలియ చేయబోతోంది అని అంటున్నారు.

మార్పు మొదలవుతుందా :

గోదావరి తీరం రాజకీయాలలో లెక్కలు మారుస్తూంటుంది. అక్కడ కనుక బీజం పడితే అది మొగ్గగా మొలకెత్తి అయిదేళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నికల సాక్షిగా విపక్షంలోకి నెడుతుంది. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే తీరుగా వ్యవహారం సాగుతోంది. ఒక్కసారి కనుక మార్పు వస్తే అది అలా పెరిగి పెద్ద అవుతూనే ఉంటుంది. గోదావరి జనాలు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇస్తే అదే రూట్ తీసుకుంటారు అని అంటారు. మరి రాజమండ్రిలో రాజకీయం ఎలా ఉంది. గోదావరి తీరం ఇచ్చే సందేశం ఏమిటి. పదిహేను నెలలుగా ఏపీలో సాగుతున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల రియాక్షన్ ఏ మాత్రమైనా జగన్ టూర్ లో బయటపడుతుందా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి జగన్ రాజమండ్రి టూర్ అయితే ఆసక్తిని రేపేలా ఉంది.

Tags:    

Similar News