జగన్ నమ్మకం కలిగించలేకపోతున్నారా ?
చంద్రబాబు కావాలా జగన్ కావాలా అన్న దాని మీదనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే వైసీపీలో జగన్ అత్యంత ఆకర్షణ కలిగిన నాయకుడు.;
ఏ రాజకీయ పార్టీకైనా కూడా అధినాయకులే ప్రాణ వాయువుగా ఉంటారు. గతంలో అయితే పార్టీ సిద్ధాంతాల మీద పార్టీలు నడిచేవి. ఆ తరువాత కాలం నుంచి నాయకుల ఆకర్షణే పార్టీకి పెట్టుబడిగా మారుతోంది. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఇదే రకమైన తీరు ఉంది. గెలిస్తే అధినాయకుడిని చూపించే గెలవాలి. ఓడినా అలాగే జరుగుతుంది.
ఏపీలో చూస్తే పార్టీలు అనే కంటే వ్యక్తుల మీదనే రాజకీయం సాగుతోంది. చంద్రబాబు కావాలా జగన్ కావాలా అన్న దాని మీదనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే వైసీపీలో జగన్ అత్యంత ఆకర్షణ కలిగిన నాయకుడు. ఆయనను చూసే జనాలు ఓట్లు వేస్తారు. ఆ సంగతి తెలిసిందే.
అయితే 2014లో లేని సమస్యలు వైసీపీకి 2024లో రావడం జరుగుతోంది. ఆనాడూ పార్టీ ఓటమి పాలు అయింది. కానీ అప్పుడు నూటికి తొంబై శాతం పైగా నాయకులు పార్టీని వెన్నంటి ఉన్నారు. కానీ ఇపుడు చూస్తే అలా కాదు అత్యధికులు పార్టీ గేటు దాటేస్తున్నారు. ఇలా ఎందువల్ల అంటే దానికి కారణాలు ఎవరికి వారుగా చెప్పుకున్నా వైసీపీ ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓటమి పాలు కావడం అన్నది కళ్ళ ముందు ఉంది.
గడచిన పది నెలల కాలంలో పార్తీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకోలేదు అని అంటున్నారు. ఇక జగన్ జనంలోకి రాకపోవడం కూడా అతి పెద్ద మైనస్ గా మారుతోంది. జగన్ గతంలో అంటే 2014లో అయితే ఓటమి వెంటనే ప్రజలలోకి వచ్చేశారు. పర్యటనలు చేస్తూ అటు నాయకులకూ ఇటు క్యాడర్ కి హుషార్ తెచ్చేవారు.
కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఆయన ఏ వ్యూహం ప్రకారం అలా చేస్తున్నారో తెలియడం లేదు కానీ పార్టీ చూస్తే స్తబ్దుగా ఉంది. దాంతో ఈ పార్టీలో ఉండలేక నేతలు ఎవరికి వారు జారుకుంటున్నారు. వైసీపీకి జనాదరణ లేదు అన్న ఆలోచనతో కూడా కొందరు చేస్తున్నారు. జగన్ ఈ విధంగానే ఉంటారని ఆయన బయటకు రారు అని భావించి కూడా మరికొందరు చేస్తున్నట్లుగా ఉంది.
ఇక క్యాడర్ లీడర్ ఉత్సాహం లేకపోగా ఎందుకొచ్చిన ఇబ్బంది అని కూడా వైసీపీ శిబిరం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లుగా ఉంది. అయితే ఏ పార్టీ అయినా జనంలోకి వెళ్ళాలి. బలం చూపించుకోవాలి. అపుడే నాయకులు అయినా మరెవరు అయినా పార్టీలో కొనసాగుతారు. భారీ ఓటమి తరువాత వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. జగన్ అయితే తాము మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తామని నిబ్బరంగా ఉన్నారు.
ఆయనకు ఉన్న నిబ్బరం క్యాడర్ కి లీడర్ కి లేదు. దానిని వారిలో నింపాలీ అంటే జగన్ బయటకు రావాలి. ఆయన జనంలోకి వెళ్తే వారి నుంచి వచ్చే ప్రజా స్పదననను నాయకులు గమనిస్తారు. అపుడే వారు పార్టీలో ఉండేందుకు మొగ్గు చూపిస్తారు. అలా కాకుండా మనకు బలం ఉంది అని అధినాయకత్వం అనుకున్నా అది నాయకులకు చెప్పినా వారు దానిని ఎంత మేరకు పట్టించుకుంటారు అన్నదే చర్చగా ఉంది.
మరో వైపు చూస్తే వైసీపీలోని ఈ స్తబ్దతను చూసి ప్రత్యర్ధి అయిన కూటమి పార్టీలు వారిని ఆకట్టుకుంటున్నాయి. నాలుగేళ్ళకు పైగా అధికారం చేతిలో ఉండడంతో వారిని తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఈ తరహా వలసలకు అడ్డుకట్ట వేయాలంటే జగన్ జనంలోకి రావాలని అంటున్నారు.
తాను ఎంచుకున్న ముహూర్తం నాడే వస్తామని ఆయన అనుకుంటే కనుక అప్పటికి పార్టీలో ఎంతమంది మిగులుతారు అన్నది కూడా చర్చగానే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2919లో ఓటమి చెందగానే టీడీపీ అధినేత చంద్రబాబు జనంలోకి వెళ్ళారు. అలా పార్టీని నిలబెట్టుకున్నారు.
అదే తీరున వైసీపీ కూడా ప్రజల వద్దకే వెళ్ళాలి అని అంటున్నారు. జగన్ ఒక్కసారి ప్రజలలోకి వస్తే మొత్తం సీన్ మారుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ అది జరగడమే ఆలస్యం అవుతోంది. ఇంతలో ఎవరికి వారు సర్దుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు వైసీపీ హైకమాండ్ తగిన యాక్షన్ ప్లాన్ తో ముందుకు రావాలని అంతా కోరుతున్నారు.