బాబు పాటనే అందుకుంటున్న జగన్...నమ్మొచ్చా ?

నిజానికి చూస్తే రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పటికపుడు మారుతూ ఉండాలి. తమ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే వారి రాజకీయం పండదు.;

Update: 2025-05-08 13:30 GMT

అధినాయకులు ఎపుడూ అధికారంలో ఉన్నపుడు మారేది ఉండదు. వారికి అంతా పవర్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఓటమి పాలు అయితే అపుడు వాస్తవం అర్ధం అవుతుంది. అలా నేను మారిన మనిషిని అంటారు. అయితే గతంలో ఆయా నాయకుల తీరు వైఖరిని చూసిన క్యాడర్ అంత తొందరగా నమ్ముతుందా అన్నదే చర్చ.

నిజానికి చూస్తే రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పటికపుడు మారుతూ ఉండాలి. తమ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే వారి రాజకీయం పండదు. ఇక చంద్రబాబు అయితే ఓటమి చెందిన సందర్భాలలో తాను మారాను అని చెబుతూంటారు. నన్ను అర్థం చేసుకోండి అని కూడా అందరికీ కోరుతారు.

అలా బాబు తన రాజకీయ జీవితంలో మూడు సార్లు విపక్షంలో ఉన్నారు ఆ సమయంలో పార్టీ నాయకులకు ఆయన తాను మారాను అని చెబుతూ వచ్చారు. అయితే బాబు మాటలను అటు పార్టీ జనాలు ఇటు సాదర జనాలు గట్టిగా నమ్మారు కాబట్టే ఆయన నాలుగవ సారి కూడా సీఎం కాగలిగారు.

అయితే అధికారంలోకి వచ్చిన ప్రతీసారి బాబు ఏ మేరకు మారారు అన్నది కూడా వారికే తెలుసు. ఆ వివరాల్లోకి పోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇపుడు బాబు పాటనే జగన్ అందుకుంటున్నారు. ఇది తప్పదు మరి. జగన్ ఇపుడు విపక్షంలో ఉన్నారు. అందువల్ల ఆయన తన గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది.

తరచూ పార్టీ మీటింగ్స్ లో జగన్ తాను మారాను అని చెబుతూ వస్తున్నారు. అధికారంలో వైసీపీ ఉన్నపుడు కొన్ని తప్పులు జరిగాయని ఆయన ప్రత్యేకంగా చెప్పకుండానే అంగీకరిస్తున్నారు. ఇక మీదట పార్టీ వారికి పెద్ద పీట వేస్తాను అని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈసారి వైసీపీ గెలిస్తే పార్టీ క్యాడర్ కే అగ్ర తాంబూలం అని అంటున్నారు.

జగన్ అధికారంలో ఉన్నపుడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని రావడం వల్ల క్యాడర్ పార్టీలో ఏమీ కాకుండా పోయింది. ఇక నేరుగా నగదు బదిలీ పధకాన్ని అమలు చేయడం వల్ల కూడా పార్టీలో ఎమ్మెల్యేల స్థాయి నుంచి కీలక నాయకులకు జనంతో కనెక్షన్ కట్ అయింది. దానికి తోడు చాలా చోట్ల భూ కబ్జాలు ఇసుక లిక్కర్ వంటి వాటిలో ఇష్టం వచ్చినట్లుగా కొందరు నేతలు చేసిన అవినీతి వీటితో పాటుగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా మధ్యతరగతి ఉన్నత వర్గాలు దూరం కావడం జరిగాయి.

ఇపుడు జగన్ విపక్షంలో ఉన్నారు. దాంతో ఆయనకు అన్నీ అర్ధం అవుతున్నాయి. ఆయన పార్టీలో ప్రతీ ఒక్కరికీ తాను అందుబాటులో ఉంటాను అని చెబుతున్నారు నాతో నేరుగా ఏ సమస్య అయినా చెప్పండి అని పార్లమెంటరీ పార్టీ పరిశీలకులను జగన్ కోరారు. నాతో చెప్పుకునే చనువు మీ అందరికీ ఉందని ఆయన అంటున్నారు.

ఈ పార్టీ మనది అంతా కలసి పనిచేసి సమిష్టిగా కృషి చేసి మరోసారి అధికారంలోకి తీసుకుని వద్దామని జగన్ చెబుతున్నారు. పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని అంటూనే అధికారంలోకి వైసీపీ వస్తే పార్టీ ఫస్ట్ అని కూడా జగన్ స్పష్టంగా చెబుతున్నారు.

ఇలా జగన్ పార్టీ నేతలకు తాను మారిన సంగతిని వివరిస్తున్నారు. వారు కూడా జగన్ మారితే చాలు అని చూస్తున్నారు. తమ నాయకుడు ఎలాంటి కోటరీ లేకుండా నేరుగా తాము కలిసే అవకాశం ఇస్తే చాలు గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఆయనకు తెలుస్తాయని దాని వల్ల పార్టీకే మేలు జరుగుతుందని వారు అంటున్నారు.

ఇటీవల పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమికి వంద కారణాలు అని చెప్పారు. అందులో అధినాయకత్వం సరిదిద్దుకోవాల్సినవి కూడా అనేకం ఉన్నాయని అంటున్నారు. జగన్ సైతం వాస్తవాలను అర్ధం చేసుకున్నారు అని అంటున్నారు.

మరి జగన్ మారితే కనుక అది నిజం అయితే కనుక వైసీపీకి పూర్వ వైభవం వస్తుంది అని అంటున్నారు. మరి తాను మారాను అని నాయకుడు అనడం కాదు ఆ దిశగా కార్యాచరణ కూడా ఉండాలని కోరుతున్నారు. పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఎప్పటికపుడు మమేకం అవుతూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు. మరి మారిన జగన్ ఎలా ఉంటారో ఫ్యూచర్ లో చూడవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News