మోడీ బాబు పవన్ జగన్...వాటే మల్టీస్టారర్ !
ఈ నలుగురూ ఒకేసారి ఒకే చోట కలిసే వీలుందా. అంటే ఎందుకు కాదు అన్నది వెంటనే జవాబు వస్తుంది.;
ఈ నలుగురూ ఒకేసారి ఒకే చోట కలిసే వీలుందా. అంటే ఎందుకు కాదు అన్నది వెంటనే జవాబు వస్తుంది. ఆ వెంటనే ఏపీ పాలిటిక్స్ గత దశాబ్దన్నర కాలంగా ప్రత్యర్ధుల కంటే భీకర శత్రువులు మాదిరిగా పోరాడుతున్న తీరుని చూసిన వారికి ఇది అసలు జరిగేది కాదు అని కూడా అనిపిస్తున్నారు. వెరీ సింపుల్ గా నో చాన్స్ అనేస్తారు.
అయితే ఇది రాజకీయం. కాబట్టి ఏమైనా జరగవచ్చు. అందుకే పై నలుగురూ ఒకేసారి కనిపించేందుకు చాన్స్ ఉంది అని అంటున్నారు. అయితే పై నలుగురిలో ముగ్గురు మోడీ బాబు పవన్ మాత్రం కనిపించడం గ్యారంటీ. ఇదంతా ఎక్కడ అంటే మే 2న అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నారు.
ఆ రోజున ఆయన అమరావతిలో కనీసంగా మూడు గంటల పాటు గడపనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన ప్రధాని ఒక గంట పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత ఆయన బయల్దేరి వెళ్తారు. మొత్తానికి చూస్తే భారీ ఎత్తున అమరావతి పునర్ నిర్మాణ పనులను ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టగా తీసుకుని నిర్వహిస్తోంది.
ఇందుకోసం మంత్రుల కమిటీ కూడా చురుగ్గా పనిచేస్తోంది. ఇక అయిదారు లక్షల మందిని నాటి సభకు రప్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతిలో ప్రధాని ద్వారా శ్రీకారం చుట్టబడుతున్న రాజధాని పునర్ నిర్మాణ పనుల కార్యక్రమాల్లో ఆ సంబరాలలో ప్రతిపక్షాలకూ చోటు కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది.
ఏపీలో ప్రతిపక్షాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైసీపీ. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్న ఏడాది క్రితం వరకూ సీఎం గా పనిచేసిన జగన్ ని ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అంటే అది రాజకీయ విశేషమే అని అంటున్నారు. ఇప్పటికి పదేళ్ళ క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఆనాటి కార్యక్రమానికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ని ఆహ్వానించారు. కానీ ఆయన అపుడు హాజరు కాలేదు.
మరి ఈసారి ఆయన వస్తారా అన్నది పెద్ద చర్చ. అయితే ఏపీకి పదకొండేళ్లుగా రాజధాని అన్నది లేదు కూటమి ప్రభుత్వం దానిని నిర్మించే పనిలో ఉంది. వైసీపీ మూడు రాజధానులు అన్నా జనాలు పట్టించుకోలేదు. పైగా ఏపీకి రాజధాని అవసరం ఉంది. దాంతో జగన్ కనుక ఈ సభకు వస్తే అది వైసీపీకి కూడా మంచిదని అంటున్నారు. అంతే కాదు తాము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని ఒక బలమైన సంకేతం పంపించినట్లు అవుతుంది అని అంటున్నారు.
అది వైసీపీకి ఫ్యూచర్ లో రాజకీయంగా లాభించే వీలు ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీకే గర్వకారణంగా నిలిచే ఇలాంటి కార్యక్రమమాల్లో రాజకీయాలు పక్కన పెట్టి అంతా ఒక్కటే అన్న భావనను దేశానికి పంపించాల్సి ఉందని అంటున్నారు. మరి కూటమి ఆయనకు ఎలా ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానం మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది. అసలు జగన్ వస్తారా ఈ ప్రశ్నలకు జవాబులు కొద్ది రోజుల్లో తెలుస్తాయి అని అంటున్నారు.