సగటు జీవికి సీఎం రేవంత్ స్వీట్ న్యూస్
వేతన జీవులు.. అందునా మధ్యతరగతి జీవులను కదలిస్తే తమను.. తమ అవసరాల్ని.. తమ ఇబ్బందుల్ని ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవన్న మాట వారి నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది.;
వేతన జీవులు.. అందునా మధ్యతరగతి జీవులను కదలిస్తే తమను.. తమ అవసరాల్ని.. తమ ఇబ్బందుల్ని ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవన్న మాట వారి నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తమ జీతంలో కోత పెట్టే ఆదాయపన్ను మొదలు.. ప్రతి విషయంలోనూ తమ మీద భారం మోపటమే తప్పించి.. ఊరట కలిగించేలా ఏ ఒక్క నిర్ణయం ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
నిరుపేదలకు ప్రభుత్వాలు చేసే సాయాన్ని ఆపాలని ఎవరూ కోరరు కానీ.. ఆ పేరుతో మధ్యతరగతి వారి మీద అదే పనిగా భారం మోపటంపై ఇటీవల కాలంలో అసంతృప్తి పెరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వాలు అసలు లేవనే చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. ఆయన ఈ అంశాన్ని గుర్తించారా? అన్న భావన కలుగకమానదు. ఇప్పటివరకు ఒక వాహనం (అది టూవీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ) ఉండి మరో వాహనం కొనే వేళలో.. రెండో వాహనానికి రెండు శాతం అదనపు పన్ను (లైఫ్ ట్యాక్స్) వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంట్లో బైకు.. కారు కొనటం మామూలవుతోంది. కారు కొనే వేళలో.. అదనంగా రెండు శాతం పన్ను కట్టాల్సి రావటంపై కొంత వేదన ఉంది. తమ లాంటి ట్యాక్స్ పేయర్స్ కు కూసింత ఊపశమనం కూడా ప్రభుత్వం కల్పించదా? మేమేం పథకాలు కోరుకోవటం లేదు. మా డబ్బులతో మేం కొనుక్కునే వస్తువలకు అదనపు పన్ను వేయటం ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తున్న పరిస్థితి. తాజాగా సీఎం రేవంత్ ఈ పాత విధానానికి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది సగటున 7 లక్షల కొత్త బైకులు.. 2.57 లక్షల కార్లు కొనుగోలు చేస్తున్నారు ఇందులో 1.91 లక్షల మంది సెకండ్ వెహికిల్ కొనుగోళ్లు ఉంటున్నాయి. ఈ సెకండ్ వెహికిల్ మీద వసూలు చేసే 2 శాతం పన్ను కారణంగా ప్రభుత్వానికి రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే.. వాహనదారుల ముఖాల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ ఈ అదనపు పన్ను బాదుడకు చెక్ పెడుతున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. దాదాపు 2 లక్షల మంది వాహనదారుల మీద భారం తగ్గనుంది.