అసలు సిసలు ముద్దుల మామయ్య ఇతనే..!

మారిన కాలంలో బంధాలకు బీటలు వారిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళలో.. అనుబంధాలకు పెద్దపీట వేస్తూ.. ఇలాంటి బంధాలు ఉంటే ఎంత బాగుండన్నట్లుగా ఒక ఉదంతం చోటు చేసుకుంది.;

Update: 2026-02-06 05:06 GMT

మారిన కాలంలో బంధాలకు బీటలు వారిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళలో.. అనుబంధాలకు పెద్దపీట వేస్తూ.. ఇలాంటి బంధాలు ఉంటే ఎంత బాగుండన్నట్లుగా ఒక ఉదంతం చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన బాలయ్య ముద్దుల మామయ్య పేరు.. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే మనసులో మెదలటం ఖాయం. అంతలా అందరిని కనెక్టు అయ్యే ఈ ఉదంతంలోకి వెళ్లాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని ఒక మేనమామ తన మేనల్లుడి మొదటి పుట్టిన రోజుకు చేసిన హడావుడి గురించి తెలిస్తే.. ఆనందంతో నోటమాట రాని పరిస్థితి. అంతేకాదు.. అందరికి ఇలాంటి మేనమామ ఉంటే ఎంత బాగుండన్న భావన కలుగకమానదు.

యూపీలోని అలీగఢ్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. అఖిలేశ్ చౌహాన్ అనే వ్యక్తి తన బుజ్జి మేనల్లుడు శివాయ్ తొలి పుట్టిన రోజు వేడుకుల కోసం భారీ ఎత్తున కానుకల్ని ఇచ్చాడు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు వైరల్ గా మారింది. మేనల్లుడి మొదటి పుట్టినరోజుకు ఖరీదైన ప్లాట్ (అలీగఢ్ - ఆగ్రా హైవే పక్కన)తో పాటు రూ.11 లక్షల క్యాష్, 20 గ్రాముల బంగారు గొలుసు, అర కేజీ వెండి వస్తువులు, పలు రకాల దుస్తులు, బొమ్మలు ఇచ్చాడు. అంతేనా.. తన సోదరి (మేనల్లుడి తల్లి)కి 35 గ్రాముల బంగారు హారంతో పాటు బంగారు గాజులు, ఉంగరం, చెవిపోగులు, వెండి పట్టీలు.. పలు రకాల దుస్తుల్ని బహుమతులుగా ఇచ్చాడు.

విషయం అక్కడితే అయిపోలేదు. తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిధులందరికి కానుకలు అందజేశాడు. ఇంట్లో ఒక వైపు గుట్టలా అమర్చిన ఈ కానుకల చిట్టాను ఒక వ్యక్తి చదవుతుంటే.. ఆ పార్టీకి వచ్చిన వారంతా విస్తుపోయిన పరిస్థితి. ప్రియమైన శివాయ్ కు ప్రేమతో నీ మామ కానుకలు అన్న వ్యాఖ్య జోడించి ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ వీడియోకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకూ అఖిలేశ్ చౌహాన్ ఎవరు? ఏం చేస్తుంటాడు? అన్న వివరాల్లోకి వెళితే.. ఇతనో రియల్ ఎస్టేట్ వ్యాపారి. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. భారత్ ఎస్టేట్స్ పేరుతో వ్యాపారం చేస్తుంటాడు. సామాజిక కార్యకర్తగా పేరుంది. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇతను కర్ణి సేనలో కార్యకర్తగా పని చేస్తుంటాడు. తన మేనల్లుడి మొదటి పుట్టిన రోజుకు ఇచ్చిన భారీ కానుకలతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇతను సుపరిచితుడిగా మారాడు. ముద్దుల మామయ్యగా నిలిచాడు.

Tags:    

Similar News