జగన్ ప్రతిపక్ష హోదా... బాబు కూడా తేల్చేశారుగా !

ఏపీలో ప్రతిపక్ష హోదా మీద అధికార విపక్షాలు రెండూ గట్టిగానే వాదులాడు కుంటున్నాయి. మాటా మాటా విసురుకుంటున్నాయి.;

Update: 2025-09-10 21:30 GMT

ఏపీలో ప్రతిపక్ష హోదా మీద అధికార విపక్షాలు రెండూ గట్టిగానే వాదులాడు కుంటున్నాయి. మాటా మాటా విసురుకుంటున్నాయి. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లుగా అయిదు నిముషాల సమయం ఇస్తామంటే తాము అసెంబ్లీకి వచ్చి ఏమిటి ఉపయోగం అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే మైకులు ఇవ్వని పరిస్థితి ఉంటుందని అన్నారు. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే తమకు తగినంత సమయం దొరుకుతుందని అపుడు ప్రజా సమస్యలని పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. ప్రజా సమస్యల మీద చర్చకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు.

కోర్టుకు జవాబు చెప్పాలంటూ :

మరో వైపు హైకోర్టులో తాము ప్రతిపక్ష హోదా గురించి పిటిషన్ దాఖలు చేశామని ప్రస్తుతం అది విచారణ దశలో ఉందని కూడా జగన్ చెబుతున్నారు స్పీకర్ ఆఫీసుని ఈ విషయంలో కోర్టు వివరణ అడిగిందని ముందు దానికి జవాబు చెప్పాలని ఆయన కోరారు. మొత్తం మీద చూస్తే జగన్ తేల్చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని లేకపోతే రాలేమని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.

హోదా ఊసే లేకుండా రండి :

మరో వైపు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా బయట రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారని నిందించారు. సభకు వస్తే సమస్యలు ఏమిటో చర్చిస్తే ఎవరేమిటో తెలుస్తుందని అన్నారు. తాము ప్రజా సమస్యల మీద చర్చకు సిద్ధంగా ఉన్నామని బాబు ప్రకటించారు. సిద్ధం అంటూ సభలు చేసి ఎగిరి పడ్డారు కదా ఇపుడు అసెంబ్లీలో అన్ని అంశాల మీద చర్చించేందుకు మీరు సిద్ధమేనా అని బాబు సవాల్ చేశారు. ప్రతిపక్ష హోదా అని మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మీకు ఇవ్వలేదని అన్నది గుర్తు పెట్టుకోవాలని బాబు అన్నారు. అసెంబ్లీకి ముందు వస్తే మెడికల్ కళాశాలల గురించి కానీ మరో అంశం గురించి కానీ చర్చించేందుకు సిద్ధమని బాబు స్పష్టం చేశారు.

వైసీపీ పని అయిపోయింది :

ఏపీలో వైసీపీ పని అయిపోయింది అని చంద్రబాబు అనంతపురం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ ఆఫీసులు మూసుకుంటున్నారని ఆ పార్టీ ఉంది అంటే సోషల్ మీడియాలో మాత్రమే ఉందని అక్కడ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. వైసీపీకి ఎవరూ భయపడరని హింసా రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోరని ఇక్కడ ఉన్నది బాబు పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు.

క్లారిటీ వచ్చినట్లేనా :

ఒకే రోజు జగన్ వర్సెస్ చంద్రబాబుగా హోదా మీదనే చర్చ సాగింది. హోదా ఇస్తేనే అసెంబ్లీకి అని జగన్ అంటే హోదా మేము ఇవ్వడం కాదు, ప్రజలు ఇవ్వాలని బాబు అంటూనే సభకు వచ్చి సమస్యల మీద చర్చించే సత్తా మీకు లేదని సెటైర్లు వేశారు దీంతో వైసీపీ వైపే తిరిగి ఆయన బంతిని వేశారు వైసీపీ ఎటూ అసెంబ్లీకి రాదలచుకోలేదు కాబట్టి ఈ నెల 18 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ ఎమ్మెల్యేలు రానట్లే అన్నది పక్కా క్లారిటీ వచ్చినట్లే అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో కూడా ఇదే తరహా సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ ఉంటాయని అర్ధం అవుతోంది అంటున్నారు. అంతే తప్ప జగన్ ఈసారి అసెంబ్లీకి వచ్చేది ఉండదని రూఢీ అయిపోయింది అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News