వేగంగా మారుతున్న పరిణామాలు.. జగన్ డ్రైవర్ అరెస్టు, ప్రమాదంపై షర్మిల ఫైర్!

సొంత పార్టీ కార్యకర్త సింగయ్య కారు కింద పడి నలిగిపోయినా, కారు ఆపకుండా వెళ్లిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్ అవుతున్నారు.;

Update: 2025-06-22 17:57 GMT

మాజీ సీఎం జగన్ పర్యటనలో వృద్ధుడు సింగయ్య మరణంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి జగన్ కారు డ్రైవరే కారణమని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు మాజీ సీఎం జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 18న రోడ్డు మార్గంలో తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లారు జగన్. ఏడాది క్రితం మరణించిన వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు సంబంధించిన ఆ పర్యటనలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ పై పూల వర్షం కురిపించేందుకు వెళ్లిన వృద్ధుడు సింగయ్య.. వైసీపీ అధినేత జగన్ వాహనం కిందే పడిపోయిన వీడియో ఆదివారం బయటకు వచ్చింది. ప్రమాదం జరిగినా, జగన్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో జగన్ తీరుపై టీడీపీతోపాటు ఆయన సోదరి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు.

సొంత పార్టీ కార్యకర్త సింగయ్య కారు కింద పడి నలిగిపోయినా, కారు ఆపకుండా వెళ్లిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్ అవుతున్నారు. బెట్టింగులో ఓడిపోయి ప్రాణాలు తీసుకున్న వ్యక్తి కోసం మరో ఇద్దరిని బలి తీసుకున్నారని, ఇద్దెక్కడి రాక్షాసానందం అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా? ఇందులో పూర్తిగా జగన్ బాధ్యతారాహిత్యం ఉంది అని షర్మిల ట్వీట్ చేశారు. టైరు కింద మనిషి పడ్డ సోయి కూడా లేకుండా జగన్ చేతులూపడం ఏంటని ఆయన మండిపడ్డారు.

కాగా, జగన్ కారు ఢీకొని సింగయ్య మరణించాడనే అంచనాకు వచ్చిన పోలీసులు, మాజీ సీఎం కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసుస్టేషనులో రమణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం గుర్తించారా? లేదా? కారు కింద మనిషి పడిపోయారనే విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారా? లేదా? అని రమణారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆపకుండా ఎందుకు వెళ్లారంటూ పోలీసులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతోంది.

Tags:    

Similar News