రాసి పెట్టుకో రేవంత్.. నా గుండెల్లో ఉండేది కేసీఆరే.. ఎవరన్నారంటే?
తాను మళ్లీ మళ్లీ చెబుతున్నానని.. ముఖ్యమంత్రి రేవంత్ రాసి పెట్టుకోవాలన్న హరీశ్.. ‘‘ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే.;
అదే పనిగా ఒకేలాంటి విమర్శను ఎదుర్కొనే గులాబీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు తాజాగా తనపై రాజకీయ ప్రత్యర్థులు ఎక్కుపెట్టే విమర్శనాస్త్రాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను ఇరుకున పెట్టేందుకు అస్త్రంగా ఉండే అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కేటీఆర్ కు మధ్య మిత్ర భేదం పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ఇప్పటికే తాను చాలాసార్లు చెప్పానని.. మళ్లీ చెబుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
తాను మళ్లీ మళ్లీ చెబుతున్నానని.. ముఖ్యమంత్రి రేవంత్ రాసి పెట్టుకోవాలన్న హరీశ్.. ‘‘ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే. నా చేతిలో ఉండేది గులాబీ జెండానే’’ అని స్పష్టం చేశారు. తాజాగా ముగిసిన పంచాయితీ ఎన్నికల ఫలితాలపై హరీశ్ రావు మాట్లాడారు. పంచాయితీ ఎన్నికల ఫలితాల్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ అసహనం పరాకాష్ఠకు చేరిందన్న ఆయన.. రోజురోజుకీ పరిస్థితులు చేజారిపోతున్నాయన్న వేదనతో సీఎం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్నారు.
త్వరలోనే పతనం తప్పదన్న విషయంపై క్లారిటీ వచ్చిన సీఎం.. ఆగమాగమవుతున్నట్లుగా మండిపడ్డారు. ‘నాకు, కేటీఆర్ కు మిత్రభేదం క్రియేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ను బలహీనపర్చాలన్న కురచ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చేసే ఈ తరహా కుట్రలు ఫలించవు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా నేనూ.. కేటీఆర్ మరింత సమన్వయంతో సమర్థంగా.. రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం. తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ను..కాంగ్రెస్ సర్కారును గద్దె దించటమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావటం ఖాయమని స్పష్టం చేశారు. మొత్తంగా తనపై వస్తున్న ఆరోపణలకు బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం హరీశ్ చేశారని చెప్పాలి.