వైసీపీకి వాట్ నెక్స్ట్...కూటమి చాన్స్ ఇస్తుందా ?

వైసీపీ నేతలు అంతా ప్రస్తుతం ఒక పని అయిపోయింది అని రిలాక్స్ గా ఉన్నారు. ఆ పని ఏంటి అంటే కోటి సంతకాల సేకరణ.;

Update: 2025-12-19 05:30 GMT

వైసీపీ నేతలు అంతా ప్రస్తుతం ఒక పని అయిపోయింది అని రిలాక్స్ గా ఉన్నారు. ఆ పని ఏంటి అంటే కోటి సంతకాల సేకరణ. ఈ కార్యక్రమం ఒక విధంగా వైసీపీని కొంత మేరకు కదిలించింది. అక్టోబర్ 1 నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం డిసెంబర్ 18న గవర్నర్ ను కలసి అధినేత జగన్ కోటి సంతకాల పత్రాలను సమర్పించడంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఒక గ్రాండ్ సక్సెస్ గా జరుపుకుంది. ప్రజలు ఈ కీలకమైన అంశం మీద పూర్తి పాజిటివ్ గా స్పందించారు అని వైసీపీ అగ్ర నేతలు పేర్కొంటున్నారు. జగన్ అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా స్పష్టం చేశారు.

కనెక్ట్ అయిన ఇష్యూ :

విద్య వైద్యం అన్నవి సాధారణంగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలు. ఇక ఏ రాజకీయ పార్టీ ఏ రకమైన కార్యక్రమాలు చేసినా నూటికి నూరు శాతం జన సహకారం ఉండదు, అయితే అటెన్షన్ పెట్టే హాట్ ఇష్యూ అయితే మాత్రం జనంలో చర్చ సాగుతొంది. ఆ విధంగా ప్రభుత్వ రంగంలోకి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి చూస్తోంది అన్న వైసీపీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ జనంలోకి ఎంతో కొంత వెళ్ళాయి. దాంతో ఈ విషయంలో వైసీపీలో సంతృప్తి అయితే ఉంది.

తరువాత ఏముంది :

వైసీపీ విపక్షంలో ఉంది. అందువల్ల ఆ పార్టీ నిరంతరం ప్రజలలో ఉండాలి, ఆందోళనలు చేపట్టాలి, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాలి. అయితే అందులోనే కీలకం ఉంది. అన్ని అంశాలు జనాలను కదిలించలేవు. రాజకీయంగా తేలిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే సగటు జనం సమస్యలను పట్టుకోవాలి. అవి కూడా కోటి సంతకాల సేకరణ మాదిరిగా దీర్ఘకాలం జనంలో నలిగేలా ఉండాలి. అంటే వాటికి అంతటి పొటెన్షియాలిటీ ఉండాలి అన్న మాట. మరి ఆ రకంగా చూస్తే ఏణ్ణర్ధంగా సాగుతున్న కూటమి పాలనలో ఏ ఏ అంశాల మీద జనంలో వ్యతిరేకత ఉందో అధ్యయనం చేయాల్సి ఉంది.

అర్జంటుగా కావాలి :

వైసీపీ అధినాయకత్వం అయితే క్యాడర్ ని రిలాక్స్ గా ఉంచకూడదని ఆలోచిస్తోంది. అలా ఉంచితే కనుక మళ్ళీ కదపడం ఒకింత కష్టం అవుతోంది అని భావిస్తోంది. అయితే సరైన ఇష్యూస్ లేకుండా జనంలోకి వెళ్తే బూమరాంగ్ అవుతుందన్నదీ ఉంది. అందుకే ఆచీ తూచీ వైసీపీ వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం మీద నిశిత పరిశీలన జరుపుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఏ రకమైన చాన్స్ వైసీపీకి ఇస్తుంది అన్న దాని మీదనే ఇదంతా ఆధారపడి ఉంది. కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఉంటోంది.

జనాలకు ఆశలు పోలేదు :

అయితే పాలసీల మీదనే వైసీపీ కొన్ని సందర్భాలలో పోరాడాల్సి ఉంది. సూపర్ సిక్స్ హామీల మీద ఆందోళన చేసినా పెద్దగా క్లిక్ కాదు, వాటి మీద జనాలకు ఇంకా ఆశలు పోలేదు. దాంతో రాజధాని కానీ పోలవరం కానీ మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. భూములను పందేరం చేస్తున్నారు అని అన్నా కూడా అది సైతం రివర్స్ అవుతుంది. ఎందుకంటే అభివృద్ధి కోసమే భూములు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు కూడా దానికి ఓకే అనే సీన్ ఉంటుంది. మొత్తానికి చూస్తే వైసీపీలో ఎంతో కొంత ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ సరైన ఇష్యూస్ తో జనంలోకి రాకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News