పట్టపగలు అనకాపల్లిలో బ్యాంక్ చోరీ.. లేడీ మేనేజర్ రియాక్షన్ తో పరార్
రింగ్ రోడ్ లో ఉన్న బ్యాంకులోకి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు వాహనాల్లో ఏడుగురు దొంగలు బ్యాంకు వద్దకు వచ్చారు.;
పట్టపగలు అనకాపల్లిలో కొందరు దొంగలు రెచ్చిపోయారు. బ్యాంక్ ను దోచుకునేందుకు ప్లాన్ చేశారు. తమ పథకంలో భాగంగా వారు వేసిన ఎత్తుగడను సదరు బ్యాంక్ లేడీ మేనేజర్ చిత్తు చేశారు. చాకచక్యంగా వ్యవహరించటంతో పాటు.. అనూహ్య పరిస్థితుల్లో గందరగోళానికి గురి కాకుండా.. క్షణంలో వెయ్యోవంతులో స్పందించిన ఆమె తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
అనకాపల్లిలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో దొంగలు దోపిడీకి ప్లాన్ చేశారు. రింగ్ రోడ్ లో ఉన్న బ్యాంకులోకి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు వాహనాల్లో ఏడుగురు దొంగలు బ్యాంకు వద్దకు వచ్చారు. వీరిలో ఐదుగురు దొంగలు బ్యాంక్ లోకి ప్రవేశించారు. నేరుగా మహిళా మేనేజర్ వద్దకు వచ్చి గన్ ఎక్కుపెట్టారు. ఈ సమయంలో బెదిరిపోని ఆమె.. వాయు వేగంతో అలారాన్ని నొక్కేవారు. దీంతో.. ఈ అనూహ్య ఘటనకు సిద్ధంగా లేని దొంగలు బ్యాంకు నుంచి పరారయ్యారు.
ఈ ఉదంతంపై బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో అదనపు ఎస్పీ మోహన్ రావు బ్యాంకు వద్దకు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్న వేళలో దుండగులు బ్యాంకును దోచుకునే ప్రయత్నం చేయటం.. వారిని లేడీ మేనేజర్ అడ్డుకోవటంపై పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఖాతాదారులు.. బ్యాంకు సిబ్బంది మాత్రం తీవ్ర భాయాందోళనలకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ సాయంతో దొంగల్ని గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఏమైనా.. ఈ ఉదంతంలో బ్యాంకు లేడీ మేనేజర్ ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే.