ఏందిది పవనా? ఏపీలో సెట్ కాలేదు.. తెలంగాణ మున్సిపోల్స్ లో ఎంట్రీ అవసరమా?
డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ పై విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటే.. సరైన రీతిలో సొంత పార్టీ నేతలే రియాక్టు అయ్యింది లేదు.;
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందంటూ వార్తలు రావటం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వెలువడింది. దీంతో తెలంగాణలో జరిగే మున్సిపోల్స్ లో జనసేన ఎంట్రీ ఇచ్చినట్లైందని చెప్పాలి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఈ నెల 7,8 తేదీల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
బీజేపీ.. జనసేన అభ్యర్థుల తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని పార్టీ పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచార షెడ్యూల్.. రూట్ మ్యాప్ ను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా పార్టీ పేర్కొంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమంటే.. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్న జనసేన.. ఆ పార్టీ మంత్రులు తమదైన ముద్రను పెద్దగా వేసింది లేదు.
ఈ మధ్యనే ఆ పార్టీ చీప్ విప్ కం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చింది లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ పై విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటే.. సరైన రీతిలో సొంత పార్టీ నేతలే రియాక్టు అయ్యింది లేదు. మంత్రులుగా ఉన్న జనసేన పార్టీకి చెందిన నేతలు తమదైన ముద్రను ప్రభుత్వంపైన వేసింది లేదు. ఇలా ఏపీలో జనసేనకు సంబంధించి మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టకుండా హడావుడిగా తెలంగాణ మీద గురి పెట్టటం సరి కాదన్న మాట వినిపిస్తోంది.
విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల ప్రజల సెంటిమెంట్లు..రాజకీయ ప్రాధాన్యతల విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు అధికారం ఇచ్చిన ఏపీ ప్రజలకు చేయాల్సింది చాలానే ఉన్ననప్పుడు దాన్ని వదిలేసి.. తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేయటం సరైన వ్యూహం కాదంటున్నారు. ఇప్పటికే ఏపీ విపక్షం నుంచి వచ్చే విమర్శలకు జనసేన ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతోంది.
ఇలాంటి వేళలో తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ కు అటు బీఆర్ఎస్ నుంచి.. ఇటు అధికార కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇవ్వటం కోరి తెచ్చుకున్న తలనొప్పిగా మారుతుందన్న విషయాన్ని పవన్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. చేతికి అధికారం ఇచ్చిన ఏపీ ప్రజలకే చేయాల్సినవి చాలా ఉన్నప్పుడు...పార్టీ ఉనికి అంతంతమాత్రంగా ఉండే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వటం సరే.. ఆశించినంత ఫలితాలు రాకపోతే.. అది తనకు.. తన పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న విషయాన్ని పవన్ ఆలోచించారా? అన్నది అసలు ప్రశ్న.