సంజ‌య్ పార్టీ మార‌లేదు: స్పీక‌ర్

బీఆర్ ఎస్ నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ త‌ర్వాత కాలం లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు.;

Update: 2026-02-04 12:30 GMT

బీఆర్ ఎస్ నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ త‌ర్వాత కాలం లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. ఇత‌ర 9 మంది పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై బీఆర్ ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా సంజ‌య్ ను అనర్హుడిగా ప్ర‌క‌టించాలంటూ.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి స్పీక‌ర్ ప్ర‌సాద‌రావును మ‌రోసారి అభ్య‌ర్థించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే సంజ‌య్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను మ‌రోసారి ప‌రిశీలించి.. నిర్ణ‌యం వెలువ‌రించాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు జ‌గ‌దీష్ రెడ్డి అభ్య‌ర్థించారు. దీనిపైనా విచార‌ణ జ‌రిపిన స్పీక‌ర్‌.. తాజాగా బుధ‌వారం ఉద‌యం నిర్ణ‌యం వెలువ‌రించారు. సంజ‌య్ పార్టీ మారిన‌ట్టుగా ఎక్క‌డా ఆధారాలు క‌నిపించ‌డం లేద‌న్నారు. అంతేకాదు.. జ‌గ‌దీష్ రెడ్డి స‌మ‌ర్పించిన వాటిలోనూ ఎక్క‌డా ఆధారాలు లేవ‌న్నారు. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ పై అన‌ర్హ‌త వేటు స‌రికాద‌న్నారు. దీంతో సంజ‌య్‌కు మ‌రోసారి క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్టు అయింది.

గ‌తంలోనే సంజ‌య్‌పై విచార‌ణ చేసిన స్పీక‌ర్‌.. 8 మంది ఎమ్మెల్యేల‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మార‌లేద‌ని.. మారిన‌ట్టుగా ఎలాంటి ఆధారాలు కూడా లేవ‌ని చెప్పారు. ఇక‌, ప్ర‌స్తుతం ఇద్ద‌రి వ్య‌వ‌హార‌మే మిగిలి ఉంది. బుధ‌వారం.. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌డియం శ్రీహ‌రిని విచార‌ణ‌కు రావాల‌ని స్పీక‌ర్ ఆదేశించారు. త‌న లాయ‌ర్‌ను వెంట‌బెట్టుకుని రావాల‌ని ఆదేశించారు.

మ‌రోవైపు.. ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌.. అస‌లు తాను పార్టీ మార‌లేద‌ని.. అలాంటప్పుడు విచా ర‌ణ అనే అంశం త‌లెత్త‌ద‌ని పేర్కొంటూ స్పీక‌ర్‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈయ‌న వ్య‌వ‌హారం పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. అన‌ర్హ‌త వేటు వేయాలంటూ.. బీఆర్ ఎస్ వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ సాగుతోంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి 4 వారాల గ‌డువు ఇచ్చింది. ఇప్ప‌టికే రెండు వారాలు పూర్త‌య్యాయి.

Tags:    

Similar News