పార్టీలో కుట్ర జరగలేదు సరే.. ఇంతకాలం మౌనమేల మీనాక్షి?

రాజ్యసభ ఎన్నికల బరిలో నామినేషన్ లో వివరాలు పూర్తిగా వెల్లడించని కారణంగా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న మీనాక్షి నటరాజన్ గురించి తెలిసిందే.

Update: 2026-06-22 08:30 GMT

రాజ్యసభ ఎన్నికల బరిలో నామినేషన్ లో వివరాలు పూర్తిగా వెల్లడించని కారణంగా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న మీనాక్షి నటరాజన్ గురించి తెలిసిందే. మీనాక్షి నామినేషన్ రిజెక్టు కావటంలో సొంత పార్టీకి చెందిన వారు చేసిన కుట్ర అంటూ ఒక వాదన బలంగా వినిపించటం తెలిసిందే. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన ఆమెకు మాత్రమే కాదు.. పార్టీకి సైతం దిమ్మ తిరిగేలా షాకిచ్చిన వైనంపై పలు సంచలన విశ్లేషణలు తెర మీదకు వచ్చాయి. ఇలాంటి వేళ.. చిన్న అంశానికి ఏకంగా రాజ్యసభ సభ్యత్వాన్నే కోల్పోయిన మీనాక్షి మేడమ్ రియాక్షన్ ఏంటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం ఈ అంశం మీద మౌనంగా ఉన్న మీనాక్షి.. తాజాగా రియాక్టు అయ్యారు.

తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఎపిసోడ్ మీద వినిపిస్తున్న వాదనల్ని కొట్టిపారేశారు. మీనాక్షిని అడ్డుకోవటానికి కాంగ్రెస్ లో కుట్ర జరిగిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదన్న ఆమె.. అలాంటి అవసరం పార్టీలో ఎవరికి లేదని స్పష్టం చేశారు. తాజాగా ఆమె హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన నామినేషన్ రిజెక్టు కావటం వెనుక పార్టీకి చెందిన వారే ఉన్నారని..వారిచ్చిన లోగుట్టు సమాచారమే మీనాక్షిని దెబ్బ తీసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి బరిలోకి దిగిన మీనాక్షికి ఒకలా దెబ్బ పడితే.. మధ్యప్రదేశ్ లో బలం లేనప్పటికి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి.. కాంగ్రెస్ కు దెబ్బేసి మరీ.. ఆ సీటు ఇండిపెండెంట్ (సదరు అభ్యర్థి బీజేపీకే మద్దతు ఇస్తారు) కు దక్కేలా చేసిన విషయాన్ని ప్రస్తావించిన మీనాక్షి.. తన నామినేషన్ విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. ఎలక్షన్ కమిషన్ బీజేపీతో రాజీ పడ్డాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసులో నాకు నోటీసు ఇచ్చిన సమాచారాన్ని తెలంగాణలో ఎవరైనా ఎందుకు లీక్ చేస్తారు? అని ప్రశ్నించిన ఆమె.. తనను ఇరుకున పడేసేందుకు ఇలాంటి కుట్ర చేశారని.. కాంగ్రెస్ వారే చేశారన్న వాదనలో అస్సలు నిజం లేదని స్పష్టం చేశారు.

తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని.. కేవలం తనకు నోటీసు మాత్రమే ఇచ్చారన్న మీనాక్షి.. ఇలాంటి కేసుల వివరాలు నామినేషన్ లో తెలపాల్సిన అవసరం లేదన్నారు. తన నామినేషన్ రిజెక్టు అయిన ఉదంతంలో తాను ఒక్క నిమిషం కూడా నిరాశకు గురి కాలేదన్న మీనాక్షి.. బీజేపీ ఎలాంటి రాజకీయం చేస్తుందో దేశానికి చూపించామన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ రెండేళ్లుగా చెబుతున్న ఓటు చోరీ.. సీటు చోరీ నిజమన్న విషయం రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి రుజువైనట్లుగా పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా..తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురై.. పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన ఇన్నాళ్లకు.. మీనాక్షి మేడమ్ స్పందించటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నామినేషన్ రిజెక్టు కావటం సరే..దానిపై స్పందించటానికి ఇంత టైం తీసుకున్నారేంటి మీనాక్షి మేడమ్?

Tags:    

Similar News