కాక్రోచ్ జనతా పార్టీ సీజన్ 2.. జంతర్ మంతర్ వద్ద రెడీ చేస్తున్నారట..
డ్రామాలు, నిరసనలు, రీల్స్ మత్తు విపరీతంగా పెరిగిపోయిన ఈ డిజిటల్ యుగంలో.. రాజకీయ ఆందోళనలు కూడా ఓటీటీ వెబ్ సిరీస్‌ల బాట పట్టాయి.
డ్రామాలు, నిరసనలు, రీల్స్ మత్తు విపరీతంగా పెరిగిపోయిన ఈ డిజిటల్ యుగంలో.. రాజకీయ ఆందోళనలు కూడా ఓటీటీ వెబ్ సిరీస్‌ల బాట పట్టాయి. 'జంతర్ మంతర్' వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆడిన 'సీజన్-1' ధర్నాలు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల అలియాస్ నెటిజన్ల విపరీతమైన డిమాండ్ మేరకు ‘జంతర్ మంతర్ సీజన్-2’ ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ఆర్భాటంగా ప్రకటన చేసేశారు.
గతంలో ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల వీడియోలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లైక్‌లు, షేర్ల సునామీ సృష్టించిన సంగతి విజ్ఞులైన నెటిజన్లందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో విద్యార్థుల సమస్యలపై కేంద్రం ముందుకొచ్చి పరిష్కరించింది. దీంతో కాక్రోచ్ పార్టీకి, నాయకులకు మాత్రం నెటిజన్ల నుంచి లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్లు గట్టిగానే వచ్చాయి. ఇక అంత గొప్ప 'పబ్లిసిటీ ఫార్ములా'ను ఊరికే వదులుకోవడానికి అభిజిత్ దీప్కే అస్సలు సిద్ధంగా లేరట. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే రెండో సీజన్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.
అయితే ఈ కొత్త సీజన్‌లో ఎలాంటి నిరసనలు ఉంటాయో అసలు ఏ సమస్యలపై మైకులు పగలగొడతారో ఆందోళనల స్క్రిప్ట్ ఎలా ఉండబోతోందో అభిజిత్ దీప్కే గారు ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు. టీజర్ వదిలాం కదా.. ప్రస్తుతానికి ఆ బజ్జ్ అనుభవించండి, అసలు కథ, స్క్రీన్‌ప్లే, మెయిన్ ట్రైలర్ తర్వాత ఇస్తాం అన్నట్లుగా భలే సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.
అక్కడితోనే ఆగితే అది అసలైన పొలిటికల్ స్కెచ్ ఎలా అవుతుంది? అందుకే కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ కే పరిమితమైతే ఎలా? మన కంటెంట్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లాల్సిందే అని డిసైడ్ అయిన దీప్కే.. వచ్చే నెల నుంచే ‘క్యా బోల్తీ పబ్లిక్’ అనే సరికొత్త ప్రచార అర్బాటాన్ని మార్కెట్‌లోకి వదులుతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ వీధుల్లో మైకులు పట్టుకుని అరిచింది చాలు.. ఇక దేశమంతా తిరిగి ప్రజలను 'ఏం చెప్తున్నారు భయ్యా?' అని అడిగి ఆ వీడియోలను నెట్‌లో వైరల్ చేయడమే ఈ క్యాంపెయిన్ అసలు మాస్టర్ ప్లాన్ లాగా కనిపిస్తోంది.
మొత్తానికి పొలిటికల్ రీల్స్, లైవ్ ధర్నాల వినోదాన్ని ఉచితంగా ఆస్వాదించే సోషల్ మీడియా బ్యాచ్‌కు రాబోయే రోజుల్లో కావాల్సినంత 'కంటెంట్' దొరకబోతోంది. ఒకవైపు జంతర్ మంతర్ సీజన్-2.. మరోవైపు 'క్యా బోల్తీ పబ్లిక్' క్యాంపెయిన్లతో సీజేపి వేస్తున్న ఈ పొలిటికల్ సీక్వెల్ ఏ మేరకు పండుతుందో చూడాలి. ఈ రెండు షోల అధికారిక ప్రసార తేదీలు, షెడ్యూల్స్ కోసం నెటిజన్లు పాప్‌కార్న్ పట్టుకుని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీక్వెల్ సోషల్ మీడియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందో లేక రొటీన్ పొలిటికల్ స్టంట్ అనిపించుకుని డిజాస్టర్ అవుతుందో వేచి చూడాల్సిందే..