వివేకా హత్య కేసులో కాస్ట్ లీ మిస్టేక్...బాబు సంచలన వ్యాఖ్యలు
పోలీసులు నేరాల విషయంలో ఇక మీదట కఠినంగానే వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వంగా వ్యవహరించినా అది పెద్ద మిస్టేక్ అవుతుందని అన్నారు.
పోలీసులు నేరాల విషయంలో ఇక మీదట కఠినంగానే వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వంగా వ్యవహరించినా అది పెద్ద మిస్టేక్ అవుతుందని అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో చంద్రబాబు అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ తరహా సమావేశం ఇంత విస్తృత స్థాయిలో నిర్వహించడం ఇదే తొలిసారి అని బాబు ఈ సందర్భంగా చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరికీ ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.
నేరాల రూపం మారింది
ఇదిలా ఉంటే ప్రస్తుతం నేరాల రూపం మారిందని, దానికి తగినట్లుగా పోలీసింగ్ మారాలని బాబు దిశా నిర్దేశం చేశారు. అంతే కాదు క్రైమ్ దర్యాప్తులో గోల్డెన్ అవర్ కీలకం అని ఆయన చెప్పారు. వివేకా హత్య కేసు ఘటన కాస్ట్ లీ మిస్టేక్ అక్కడే జరిగింది అని ఆయన అన్నారు. వివేకా హత్య కేసు ఘటనలో పూర్తి సమాచారం రాలేదని, పోలీసుల వైపు నుంచి జరిగిన కాస్ట్ లీ మిస్టేక్ అది అని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కొందరు కావాలనే తప్పు దోవ పట్టించారని అన్నారు. ఇల్లంతా రక్తం మరకలతో తడిస్తే ఆ ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారని, ఇది పూర్తి నిర్లక్ష్యం అని అన్నారు. నేరస్తుల పట్ల ఉదాసీనంగా ఉండొద్దు అని బాబు హెచ్చరించారు.
పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టు :
ఇదిలా ఉంటే రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వారు నేర పరిశోధనలో ముందుకు సాగాలని కోరారు. అంతే కాకుండా ఇక ప్రతీ నెలా పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టు కూడా విడుదల చేస్తామని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్భోదించారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరగాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు ముఖ్యం అని బాబు స్పష్టం చేశారు. ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని అన్నారు. గడచిన రెండేళ్లుగా కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం మేర తగ్గాయని, అలాగే కాలానుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయని ఆయన చెప్పారు. . డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు తదితర నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని గుర్తు చెశారు. దీనికి అనుగుణంగా సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలని సూచించరు.
రోడ్లపై విన్యాసాలతోనే ఇబ్బందులు :
కొందరు నేతలు పరామర్శల పేరుతో రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్నారు అని చంద్రబాబు అన్నారు. వారి వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని ఆయన చెప్పారు. పరామర్శలకు వెళ్లటం తప్పేం కాదని ఆ పేరుతో రోడ్లపై చేసే ప్రదర్శనల వల్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విశాఖపట్నంలో మూడు గంటల పాటు రోడ్లను బ్లాక్ చేశారని ఆయన గతంలో జరిగిన విషయాలను గుర్తు చేశారు. ఆ సమయంలో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లే వారు ఆఫీసుకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే సీఎంగా తాను కూడా వాహన కాన్వాయ్ కుదించుకున్నానని గుర్తు చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా ఉండండి అని ఆయన స్పష్టం చేశారు.
డిజిటల్ నేరాలు పెరిగాయి :
రాష్ట్రవ్యాప్తంగా 14,770 సీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కలిపి 1 లక్ష కెమెరాలను అనుసంధానించామని బాబు చెప్పారు. నేరాల దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్‌ఏ డిటెక్షన్ లాంటి ఆధునిక విధానాలు పెరిగాయని ఆయన అన్నారు. ఆ విధంగా వేగంగా నేరాలను గుర్తించగలుగుతున్నామని, టెక్నాలజీ, నాలెడ్జి, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పోలీసు అధికారులు సమర్థంగా అమలు చేస్తే శాంతిభద్రతలు నియంత్రణలోకి వస్తాయని చెప్పారు. రాజకీయ నేరాలు, డిజిటల్ నేరాలు, సోషల్ మీడియా అసభ్య పోస్టుల లాంటి నేరాలు పెరిగాయని బాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.