రెండు గదుల ఆఫీస్... 500 మంది డెవలపర్లు.. అమెరికాలో భారీ హెచ్-1బీ మోసం

సంఘటన వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లో ఒక రెండు అంతస్తుల చిన్న భవనం ఉంది. ఆ బిల్డింగ్ చూస్తే కనీసం సక్రమంగా లైట్లు వెలగవు, తలుపులు తీసేవారు ఉండరు.

Update: 2026-08-12 14:30 GMT

అమెరికా కలలు కనే ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా మన 'టెక్' బాబులకు హెచ్-1బీ వీసా అంటే ప్రాణం. అయితే కొందరు మహానుభావులు ఈ వీసా వ్యవస్థను ఎంతో సృజనాత్మకంగా వాడుకుంటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని ఓ చిన్న భవనంలో అమెరికా కార్మిక శాఖ అధికారులు ఇటీవల జరిపిన తనిఖీలు చూసి అక్కడి ఇన్‌స్పెక్టర్లే ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది.

రెండు రూములు.. వెలగని లైట్లు.. 500 వీసాలు

సంఘటన వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లో ఒక రెండు అంతస్తుల చిన్న భవనం ఉంది. ఆ బిల్డింగ్ చూస్తే కనీసం సక్రమంగా లైట్లు వెలగవు, తలుపులు తీసేవారు ఉండరు. గాలి కూడా ఆడేలా కనిపించదు. కానీ ఆ కాగితాల అడ్రస్‌పై ఏకంగా 500కి పైగా ఆమోదం పొందిన హెచ్-1బీ వీసా దరఖాస్తులు ముడిపడి ఉన్నాయట.. అధికారులు ఎంతో ఉత్సాహంగా క్షేత్రస్థాయికి వెళ్లి "మేము అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చాం.. తలుపు తీయండి" అని నాక్ చేస్తే.. అక్కడ వినిపించింది కేవలం శ్మశాన నిశ్శబ్దం మాత్రమే "మాకు కనీసం లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు, సగం ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి" అని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆంథోనీ డి'ఎస్పొసిటో మీడియా ముందు అమాయకంగా వాపోయారు. "ఒక చిన్న భవనంలో 500 మంది ఐటీ నిపుణులు పని చేస్తున్నారంటే.. అది ఆఫీసా లేక మాయాబజారా?" అని స్థానికులు సెటైర్లు వేసుకుంటున్నారు.

మధ్యవర్తుల మహత్యం.. ఐటీ కంపెనీల గారడీ!

అసలు మేటర్ ఏంటంటే.. వీసా అప్లికేషన్లలో ఆఫీస్ అడ్రస్ చూపించడానికి ఒక 'చీకటి కొట్టు' లాంటి గదిని అద్దెకు తీసుకోవడం.. దానికి వందల వీసాలను లింక్ చేసేయడం మన మధ్యవర్తులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశీ అభ్యర్థుల నుంచి లక్షల డాలర్లు వసూలు చేయడం.. జీతాల్లో కోతలు విధించడం, కిక్‌బ్యాక్‌లు తీసుకోవడం వంటి 'సేవలను' ఈ కన్సల్టెన్సీలు అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తున్నాయట.. ఈ వ్యవహారం వెనుక అంతర్జాతీయ నేర ముఠాల హస్తం కూడా ఉందేమో అని అనుమానిస్తున్న అధికారులు ఇప్పటికే కొన్ని 'ఘనమైన' కంపెనీలకు సబ్‌పోనా నోటీసులు జారీ చేశారు.

బాధితులు ఉద్యోగులే.. విచారణ ముమ్మరం

అయితే డి'ఎస్పొసిటో గారు ఓ మంచి మాట చెప్పారు. "మా టార్గెట్ పాపం వీసాలు పొంది వచ్చిన అమాయక విదేశీ ఉద్యోగులు కాదు.. వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు దందాలు చేస్తున్న ఈ నకిలీ కంపెనీలు.. దళారులే" అని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి ఆ ఖాళీ భవనం వెనుక ఉన్న 'మహాత్ములు' ఎవరో అధికారికంగా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా టెక్సాస్ చిన్న భవనం కథ చూస్తుంటే.. అమెరికా అధికారులు దాడులు పెంచితే ఇన్స్పెక్టర్లకే కాదు.. చూసే మనకి కూడా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు ఎన్నో బయటపడేలా ఉన్నాయి.

Tags:    

Similar News