మేం రెడీ.. అనర్హత బెదిరింపులపై వైసీపీ రియాక్షన్!

కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార, విపక్షాల మధ్య చోటుచేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి.

Update: 2026-08-12 15:30 GMT

అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేస్తున్న హెచ్చరికలపై విపక్షం వైసీపీ సీరియస్ గా స్పందించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి హాజరయ్యేది లేదని పునరుద్ఘాటించింది. 40 శాతం ఓట్లు వచ్చిన తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి తీరాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యానారాయణ స్పష్టమైన ప్రకటన చేశారు. వైసీపీ సభ్యులు సభకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నారని, సభకు రాకుండా హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్పీకర్ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలా చాలాసార్లు మాట్లాడారని, దమ్ముంటే అనర్హత వేటు వేయాలని సవాల్ వేశారు. తాము కూడా రెడీగా ఉన్నామని ఏ నిబంధనల ప్రకారం తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. 40 శాతం ఓట్లు ఉన్న పార్టీగా తాము ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్నామని బొత్స తెలిపారు. ‘‘సభలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, మరొకటి విపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమెటిక్ గా విపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.

అనర్హత వేస్తామని స్పీకర్ ఎన్నోసార్లు చెప్పారని, ఆయన పరిధిలో ఉంటే అనర్హత వేయాలని సవాల్ విసిరారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. కాగా, ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సమావేశమయ్యారు. ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో సీనియర్ నేత బొత్స మాట్లాడారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులపై అనర్హత వేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు బెదిరిస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార, విపక్షాల మధ్య చోటుచేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలు హీట్ పుట్టిస్తున్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని గత కొన్నిరోజులుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిపై చర్చించడంతోపాటు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు సమావేశం అవుతున్న సందర్భంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.

దీంతో డీఎస్పీ జరుగుతున్న చర్చ ఎమ్మెల్యేల అనర్హతపై మళ్లిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సభ్యులు అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుబడుతూ, సభలో కూర్చుంటేనే హాజరు తీసుకుంటామని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేలు గైర్హాజరుగానే పరిగణిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో రెండు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేల హాజరు, అనర్హతపైనే పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అనర్హత వేస్తే ఎదుర్కోడానికి సిద్ధమంటూ వైసీప నేత బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News