ఆన్ లైన్ షాపింగ్ అలవాటు ఉందా? చదవటం మిస్ కావొద్దు
చేతిలో మొబైల్ తో ఇట్టే నచ్చిన వస్తువుల్ని కొనేయటం.. డబ్బులు చెల్లించేయటం.. ఇప్పుడు కనిపించే సర్వసాధారణమైన అంశం.
చేతిలో మొబైల్ తో ఇట్టే నచ్చిన వస్తువుల్ని కొనేయటం.. డబ్బులు చెల్లించేయటం.. ఇప్పుడు కనిపించే సర్వసాధారణమైన అంశం. గతంలో మాదిరి షాపునకు వెళ్లటం.. కోరుకున్న వస్తువుల గురించి ఆరా తీయటం.. బేరమాడటం.. చెల్లించే డబ్బుల విషయంలోనూ.. కొనే వస్తువు నాణ్యత విషయంలో ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకునే సహజ అలవాటుకు భిన్నంగా ఆన్ లైన్ కొనుగోళ్లు ఇటీవల కాలంలో ఎంతలా పెరిగాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతి ఇంట్లోనూ ఆన్ లైన్ షాపింగ్ కు పెద్ద పీట వేసే వారు ఒకరు కచ్ఛితంగా ఉంటారు. నిజానికి ఆఫ్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేయటానికి పడే తిప్పలతో పోలిస్తే.. ఆన్ లైన్ ఎంతో సమయాన్ని.. శ్రమను తగ్గిస్తుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఎడాపెడా ఆన్ లైన్ లో వస్తువుల్ని కొనుగోలు చేసే వారు.. తమను ఇట్టే మోసం చేస్తున్న వైనం మీద అవగాహన ఉందా? ఆన్ లైన్ వినియోగదారుల్ని ఎంతలా మోసం చేస్తున్నారన్న విషయాన్ని డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేసెస్ పేరుతో విడుదల చేసిన రిపోర్టులోని అంశాలు షాక్ కు గురి చేసేలా ఉంటాయని చెప్పాలి. ఈ రిపోర్టు కాస్తంత పాతదే. కానీ.. అందులో పేర్కొన్న అంశాలు మాత్రం చాలామందికి అవగాహన లేనివేనని చెప్పక తప్పదు.
షాకింగ్ నిజం ఏమంటే.. ఆన్ లైన్ సంస్థలు అమలు చేసే డార్క్ ప్యాటర్న్స్ కారణంతో దేశంలోని 88 శాతం మంది ఆన్ లైన్ కొనుగోలుదారులు మోసపోతున్నట్లుగా వెల్లడించింది. ఇలా మోసానికి గురయ్యే వారు కోల్పోతున్న డబ్బుల్ని లెక్కేస్తే.. గుండె ఆగేంత పని అవుతుంది. ఎందుకంటే ఆ మొత్తం అక్షరాల రూ.28వేల కోట్లుగా సదరు రిపోర్టు పేర్కొంది. ప్రతి ఏడాది ఇంత భారీగా నష్టానికి గురి చేసే ఈ మోసం మీద అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.
ఇలాంటివి ఏఒక్క సంస్థో.. రెండు సంస్థలో చేస్తాయని అనుకోవద్దని.. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్.. ఈ కామర్స్ .. క్విక్ కామర్స్ వెబ్ సైట్లు..యాప్ లలో ఇలాంటి మోసం సర్వసాధారణమని చెబుతున్నారు. అందుకే.. ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వేళలో.. వేదిక ఏదైనా.. మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పద్దతులకు అడ్డు కట్ట వేసేందుకు సెంట్రల్ కన్స్యూమార్ ప్రొటెక్షన్ అథారిటీ 2023లో డార్క్ ప్యాటర్న్స్ ను బ్యాన్ చేస్తూ కఠినమైన మార్గదర్శకాల్ని తెచ్చినప్పటికి 73 శాతానికి పైనే డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు వినియోగదారులను బలవంతం పెట్టే మోసపూరిత విధానాల్ని కంటిన్యూ చేస్తున్నట్లుగాఈ రిపోర్టు పేర్కొంది. ఆన్ లైన్ షాపింగ్ వేళ ఎక్కువగా జరిగే టాప్ 5 మోసాలు ఏమిటన్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. అవేమంటే..
డ్రిప్ ప్రైసింగ్
తొలుత వస్తువు ధర తక్కువగా చూపించటం.. బిల్ పే చేసే సమయంలో ప్లాట్ ఫారమ్ ఫీజు.. హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు కన్వీనియన్స్ ఫీజుల పేరుతో బాదే బాదుడు ఎక్కువగా ఉంటుంది.
ఫాల్స్ అర్జెన్సీ
ఆన్ లైన్ లో వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని ప్రకటనలు ఆసక్తితో పాటు.. అదుర్దాను పెంచేలా చేస్తుంటాయి. మరో రెండు.. మూడు వస్తువులే మిగిలినట్లుగా.. ఆఫర్ ఐదు.. పది నిమిషాల్లో పూర్తి అవుతుందని చెబుతూ తప్పుడు అలెర్టులు ఇవ్వటం
బాస్కెట్ స్నీకింగ్
షాపింగ్ చేసే వినియోగదారుడి అనుమతి లేకుండా షాపింగ్ కార్ట్ లో డొనేషన్లు.. డెలివరీ ఇన్సూరెన్స్.. చిన్న చిన్న వస్తువుల్ని ఆటోమేటిక్ గా యాడ్ అయ్యేలా చేయటం.. సర్లే.. తక్కువ మొత్తమే కదా అని అవసరం లేకుండా డబ్బులు చెల్లించేలా చేయటం
చందా ట్రాప్స్
మీరు కానీ మా వద్ద చందాదారులుగా మారితే.. మీకు బోలెడన్ని వసతులు పక్కా అంటూ చెప్పటం.. ఆ తర్వాత ఆ చందాను రద్దు చేయటానికి వినియోగదారులకు ‘సినిమా’ చూపించే తీరు
నాగింగ్
పదే పదే నోటిఫికేషన్లు పంపటం.. లొకేషన్ వివరాలు.. ఫోన్ నంబర్లు షేర్ చేయాలని పేర్కొంటూ వినియోగదారులను విసిగించే తీరు.