సిడ్నీ 'రియల్ హీరో'కు భారీ నజరానా.. స్పష్టమైన సందేశం ఇదే!
అహ్మద్ కు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, గో ఫండ్ మీ సహ నిర్వాహకుడు జాచెరీ డెరెనియోవ్స్కీ.. సెయింట్ జార్చ్ హాస్పటల్ లో బెడ్ వద్దకు వెళ్లి ఈ భారీ చెక్కును బహుకరించారు.;
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో ఇటీవల ఇద్దరు నిందితులు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయలో కాల్పులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఎదుర్కొన్నారు.. ఫలితంగా క్షణాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. ఆ అహ్మద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ సమయంలో ఆయనకు భారీ నజరానా ఇచ్చారు ప్రజానికం.
అవును.. సిడ్నీ రియల్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ చేసిన సాహసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'యు ఆర్ ది రియల్ హీరో ఆఫ్ ఆస్ట్రేలియా' అని స్వయంగా ఆ దేశ ప్రధాని కొనియాడిన పరిస్థితి. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 43వేల మంది దాతల నుంచి ‘గో ఫండ్ మీ’ సంస్థ 2.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.14 కోట్లు) సేకరించి, ఆయనకు అందించింది.
అహ్మద్ కు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, గో ఫండ్ మీ సహ నిర్వాహకుడు జాచెరీ డెరెనియోవ్స్కీ.. సెయింట్ జార్చ్ హాస్పటల్ లో బెడ్ వద్దకు వెళ్లి ఈ భారీ చెక్కును బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పొస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా ప్రజలు ఈ నిధుల సేకరణకు విరాళాలు అందించారని తెలిపారు.
ఈ చెక్కును అందచేస్తున్న సమయంలో.. ‘నేను దీనికి అర్హుడినా’? అని అహ్మద్ ప్రశ్నించగా... దానికి డెరెనియోవ్స్కీ.. ‘ప్రతీ పైసాకు’ అని అనడం వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా ఏమి చెబుతారు అని అడిగినప్పుడు అహ్మద్ ఇలా అన్నారు.. మానవులందరూ ఒకరికొకరు తోడుగా నిలబడటానికి, చెడులన్నింటినీ మరిచిపోయి, ప్రాణాలను కాపాడటానికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో.. తాను ప్రజలను కాపాడినప్పుడు, అది తాను హృదయపూర్వకంగా చేశానని.. ఎందుకంటే అది ఒక మంచి రోజని.. ఆరోజు పిల్లలు, స్త్రీలు, పురుషులు, యువత అందరితో కలిసి జరుపుకుంటున్నరాని.. అంతా సంతోషంగా ఉన్నారని.. అందుకు వారు అర్హులని, వారు ఆనందించడానికి అర్హులని తెలిపారు. ఈ సందర్భంగా దేవుడా ఆస్ట్రేలియాను కాపాడు అంటూ అహ్మద్ కోరారు.
కాగా.. 43 ఏళ్ల అహ్మద్ సుమారు 20 ఏళ్ల క్రితం సిరియాలోని వాయువ్య ప్రావిన్స్ ఇడ్లిబ్ లోని అన స్వస్థలాన్ని విడిచిపెట్టి ఆస్ట్రేలియాలో ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు!