అశోక్...అయ్యన్న...ఇద్దరు మిత్రులు
అయ్యన్నపాత్రుడు తన ప్రసంగంలో అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారని కొనియాడారు. ఆయన చేసినన్ని భూ దానాలు విరాళాలు బహుశా ఎవరూ చేసి ఉండరని అన్నారు.;
ఆ ఇద్దరూ మిత్రులు. ఒక నాడు కాదు ఒక దశాబ్దం కాదు, ఏకంగా నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన స్నేహం ఈ ఇద్దరికీ. అది ఇప్పటికీ ఎప్పటికీ వసివాడకుండా కొనసాగుతోంది. ఈ ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎంతో అభిమానంగా ఆదరంగా గౌరవంగా మెలుగుతూ ఉంటారు. తాజాగా చూస్తే ఏవియేషన్ సిటీని భీమునిపట్నంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులూ పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం రాజ్యాంగ పదవులలో ఉన్నారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ఉంటే ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యనపాత్రుడు ఉన్నారు. ఇక ఈ సభలో ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు వేసుకున్న చలోక్తులు అందరికీ ఆకట్టుకున్నాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నానో కారు అంటూ :
అయ్యన్నపాత్రుడు తన ప్రసంగంలో అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారని కొనియాడారు. ఆయన చేసినన్ని భూ దానాలు విరాళాలు బహుశా ఎవరూ చేసి ఉండరని అన్నారు. అయినా ఆయన ఎక్కడా బయటకు చెప్పుకోరని, ఆయనకు ప్రచారం అవసరం లేదని అన్నారు. అంతే కాదు ఆయన స్థాయికి అద్భుతమైన కార్లలో తిరగవచ్చునని కానీ ఆయన మాత్రం ఈ రోజుకీ నానో కారునే వాడుతారని ఆ చిన్న కారుని ఆయనే ప్రతీ రోజూ స్వయంగా శుభ్రం చేసుకుంటారు అని అంతటి నిరాడంబరత ఆయన సొంతం అన్నారు.
నా జుట్టూ ఆయన జుట్టూ :
ఇదే సభలో అశోక్ మాట్లాడుతూ నా జుట్టు అంతా తెల్లబడిపోయిందని అయ్యన్నకు అయితే జుట్టే లేదని చణుకులు విసిరారు. అంతటి సీనియర్లుగా తాము పార్టీలో ఉన్నామని చెబుతూ ఆయన ఈ మాటలు అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ గురించి తన చిన్నతనం నుంచి వింటున్నాను అని అది తమ జీవిత కాలంలో తాము బతికి ఉండగా పూర్తి అయితే సంతోషిస్తామని అశోక్ చెప్పడం విశేషం. అలాగే ఏవియేషన్ సిటీని మూడేళ్ళలో పూర్తి చేస్తామని అంటున్నారు అని అది పూర్తి అయితే చూడాలని ఉందని అశోక్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
దేవుడి చేతిలోనే అంటూ :
మన జీవితం దేవుడి చేతిలో ఉందని ఎంతకాలం ఉంటామో తెలియదు అని ఒక దశలో అశోక్ ఎమోషనల్ అయ్యారు. అందుకే ఉన్నపుడే మంచి పనులు చేయాలని ఆయన అన్నారు. తమ కుటుంబం అంతా ప్రజల సేవలో ఉందని తన తరువాత తరం కూడా ఇదే విధంగా ప్రజల కోసం మేలు చేస్తుందని ఆయన చెప్పారు. లోకేష్ ని కేంద్ర మంత్రి రామ్మోహన్ ని తన పిల్లలుగా అశోక్ చెబుతూ వారి వృద్ధిని తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
టీడీపీలో ఉత్తరాంధ్రాలో :
మొత్తం మీద చూసే ఈ సభలో అశోక్ అయ్యన్న ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మనసు విప్పి చెప్పుకుంటూ టీడీపీలో తమ స్థానాలను చూసుకుంటూ భావి తరాల కోసం తాము అండగా ఉంటామని చెప్పడం మాత్రం విశేషంగా చూడాల్సి ఉంది. అశోక్ ని మాన్సాస్ ట్రస్ట్ పదవి నుంచి వైసీపీ ప్రభుత్వం తీసేస్తే అయ్యన్నపాత్రుడు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అలాగే అయ్యన్నను అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూసినపుడు నర్శీపట్నం వెళ్ళి మరీ అండగా నిలబడ్డారు అశోక్. అలా ఈ ఇద్దరు మిత్రులు టీడీపీలో ఉత్తరాంధ్రాలో ఆదర్శనీయమైన నాయకులుగా అంతా గుర్తు చేసుకుంటున్నారు.