మెస్సీ ఈవెంట్... గంగూలీకి అంత కోపం ఎందుకొచ్చింది..!
ఇందులో భాగంగా... సతద్రు దత్తా సౌరభ్ గంగూలీకి తొత్తు తప్ప మరొకటి కాదని.. గంగూలీ మోసం గురించి ఏమి చెప్పాలి.. అందరికీ ఇప్పటికే నిజం తెలుసు.. డబ్బు ఎక్కడుంటే సౌరభ్ అక్కడికి పరుగెత్తుతాడు..;
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్ లోని నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటించిన సంగతి తెలిసిదే. ఇందులో భాగంగా.. హైదరాబాద్, కోల్ కతా, ముంబై, ఢిల్లీలో సందడి చేశారు. అయితే వీటిలో కోల్ కతా పర్యటన కూడా ఫుట్ బాల్ అభిమానులకు, లియో ఫ్యాన్స్ కు ఆనందకరమైన క్షణం అవుతుందని భావించినప్పటికీ.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమం కాస్తా గందరగోళంగా మారింది. చాలా మంది అభిమానులు తమ స్టార్ మెస్సీని స్టాండ్ల నుంచి స్పష్టంగా చూడలేకపోయారు. దీంతో.. ఆగ్రహానికి గురైన కొంతమంది ప్రేక్షకులు సీసాలు, కుర్చీలు విసరడం ప్రారంభించారు, స్టేడియం లోపల ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఈ సమయంలో.. సౌరభ్ గంగూలీపై కామెంట్లు చేయడం కొత్త మలుపు తీసుకుంది.
అవును... డిసెంబర్ 13న కోల్ కతాలోని జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ తో సౌరభ్ గంగూలీని అనుసంధానిస్తూ.. అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ఆఫ్ కోల్ కతా అధ్యక్షుడు ఉత్తమ్ సాహో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. సతద్రు దత్తా మెస్సీ ఈవెంట్ నిర్వహణలో గంగూలీ మధ్యవర్తిగా వ్యవహరించాడని సాహో బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరిన్ని కీలక ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా... సతద్రు దత్తా సౌరభ్ గంగూలీకి తొత్తు తప్ప మరొకటి కాదని.. గంగూలీ మోసం గురించి ఏమి చెప్పాలి.. అందరికీ ఇప్పటికే నిజం తెలుసు.. డబ్బు ఎక్కడుంటే సౌరభ్ అక్కడికి పరుగెత్తుతాడు.. అతను బెంగాల్ క్రికెట్ ను అంతం చేశాడు అని ఘాటు విమర్శలు చేశారు సాహో. దీనిపై గంగూలీ అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు.. అయితే అది మాటలతో కాదు, చేతలతో అన్నట్లు!
ఇందులో భాగంగా... ఉత్తమ్ సాహోపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కార్యక్రమంలో తనను ఎటువంటి అధికారిక ప్రమేయం లేదని గంగూలీ గట్టిగా ఖండించారు.. తాను ఆ ఈవెంట్ కు అతిథిగా మాత్రమే హాజరయ్యానని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తీవ్రమైనవి, నిరాధారమైనవి అని అభివర్ణించారు టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూలీ.
అసలేం జరిగింది..?:
లియోనెల్ మెస్సీ కోల్ కతా పర్యటన కేవలం 22 నిమిషాల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, శనివారం సాల్ట్ లేక్ స్టేడియం లోపల అభిమానులు అల్లర్లు చేయడంతో గందరగోళంగా మారింది. ఆ రోజు తెల్లవారుజామున మెస్సీని స్వాగతించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే.. మధ్యాహ్నం సమయానికి అంతా పూర్తిగా మారిపోయింది.
వాస్తవానికి ఆరోజు మెస్సీని చూడాలని సాల్ట్ లేక్ స్టేడియంలో సుమారు 50,000 మంది ప్రేక్షకులు గుమిగూడారు. వారిలో చాలామంది రూ.4,000 కంటే ఎక్కువ చెల్లించగా... రాజకీయ నాయకులు, వీవీఐపీలు, భారీ భద్రతతో పాటు జనసమూహాల నియంత్రణ కంటే సెల్ఫీలపై ఆసక్తి ఉన్న వ్యక్తుల సమూహం వెరసి.. ప్రేక్షకులు చూడటానికి వచ్చిన వ్యక్తిని తప్ప మిగతావన్నీ చూసేల ఓ సజీవ గోడను ఏర్పాటు చేశారు.
ఈ సమయంలో.. ప్రమోటర్ సతద్రు దత్తా జనసమూహాన్ని వెనక్కి తగ్గమని పదే పదే కోరాడు. దయచేసి అతన్ని ఒంటరిగా వదిలేయాలని, మైదానాన్ని దయచేసి ఖాళీ చేయాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు.. అయితే ఆ విజ్ఞాపణలు విస్మరించబడ్డాయి. ఈ నేపథ్యంలో సుమారు గంట పాటు స్టేడియంలో ఉండాల్సిన మెస్సీ కేవలం 22 నిమిషాలకే వెళ్లిపోయారు!
ఈ నేపథ్యంలో... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరైన గంగూలీ.. మెస్సీని ఎక్కువసేపు ఉండేలా ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఈ కార్యక్రమం రద్దైన తర్వాత.. పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్, డీజీపీ రాజీవ్ కుమార్.. మెస్సీ బృందంతో మాట్లాడి, ఒప్పించేలా ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. ఈ నేపథ్యంలో.. మీరు ఇంకొంచేం సేపు ఉంటే బాగుండేది అంటూ గంగూలీ అన్నారు.