అమరావతి మీద జగన్ అదే తప్పు చేస్తున్నారా ?
అమరావతిని రాజధానిగా 2014లో జరిగిన అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఒప్పుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో గెలిచాక మడమ తిప్పేశారు.;
అమరావతిని రాజధానిగా 2014లో జరిగిన అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఒప్పుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో గెలిచాక మడమ తిప్పేశారు. మూడు రాజధానుల స్లోగన్ అందుకున్నారు. అది ఆకుకు అందక పోకకు చెందక అలా అయిదేళ్ళ పాటు అసలు ఏపీకి రాజధాని అన్నది లేకుండా పోయింది.
అదే కూటమికి 2024 ఎన్నికల్లో ప్లస్ గా మారింది. ఏపీకి రాజధాని కావాలన్నది ఒక బలమైన సెంటిమెంట్ గా మారి మూడు ప్రాంతాలలో తేడా లేకుండా కూటమికి ఓట్లూ సీట్లూ జనాలు ఇచ్చ్ వైసీపీని దారుణంగా ఓడించారు. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని విషయంలోనే భారీ దెబ్బ వైసీపీకి తగిలింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ నేతలు కూడా అంతర్గత చర్చలలో ఇదే విషయం ఒప్పుకుంటూ వచ్చారు.
ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని అన్నది అతి సున్నితమైన అంశం అని తెలిసిన ఏ రాజకీయ పార్టీ మరోసారి దానితో చెలగాట ఆడదు, వైసీపీ కూడా ఏడాది పాటుగా అమరావతి విషయంలో పెద్దగా మాట్లాడకుండా జాగ్రత్త వహిస్తూ వచ్చింది. ఇది మంచి వ్యూహమే అని అంతా అనుకున్నారు.
అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తాజా ప్రెస్ మీట్ లో అమరావతి రాజధాని విషయంలో చేసిన సంచలన కామెంట్స్ తో వైసీపీ స్టాండ్ ఏమీ మారలేదని మరోసారి ఏపీ జనాలకు అర్ధం అయింది అని అంటున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని పరిధిలో వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు కూడా వైసీపీ వైఖరి మీద తీవ్రంగా ఆలోచించే పరిస్థితి ఉంది.
తాజా ప్రెస్ మీట్ లో జగన్ అమరావతి రాజధాని కోసం అన్నేసి వేల కోట్ల అప్పులు చేయడం ఎందుకు విజయవాడ గుంటూరు మధ్యలో అయిదు వందల ఎకరాల భూములు చూసుకుని చంద్రబాబు కట్టాల్సింది ఏదో కడితే పోలా అనేశారు. ఇది నిజంగా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ తేలికగా తీసుకుని చేసిన వ్యాఖ్యలుగానే అంతా భావిస్తున్నారుట.
అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములు తీసుకున్నపుడే ఈ మాటలు చెబితే బాగుండేది. కానీ భూ సేకరణ జరిగి దశాబ్దం అయింది. మధ్యలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని అలాగే ఉంచేసింది ఏమీ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు కూటమి ప్రభుత్వం ఏదో విధంగా దానిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్న వేళ వైసీపీ ఒక బాధ్యతాయుతమైన విపక్షంగా ఆ కామెంట్స్ చేసి ఉండకూడదని అంటున్నారు.
మరీ ముఖ్యంగా అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన జగన్ ఏపీ అభివృద్ధికి సూచనలు ఇస్తే బాగుంటుంది కానీ ఏదో ఒకటి కట్టేయండి అంతే చాలు అన్నట్లుగా చేసిన వ్యాఖ్యల మీదనే చర్చ సాగుతోంది అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పేమిటి అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. ఆ సొమ్ము రీ బాక్ అవుతుందని కూడా అంటున్నారు.
ఇక ఏపీకి మంచి రాజధాని ఉండాలి కదా అని చాలా మంది అంటున్నారు. ఈ రోజున ఏదో రాజధాని అని కాకుండా మరో వందేళ్ళ భవిష్యత్తుని కూడా దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణం సహా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందే అన్న వారూ ఉన్నారు. కానీ జగన్ మాత్రం రాజధానికి అయిదు వందల ఎకరాలు చాలు అనడం మీదనే అంతా చర్చిస్తున్నారు ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తాయని అని అంతా అంటున్నారు. విపక్షం నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి కానీ ఈ విధంగా షాకింగ్ సజెషన్స్ ఇవ్వడమేంటని అంటున్నారు.