జగన్ ఊరిస్తున్నారు... ఇంకా ఎంతెంత దూరం ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తన పాదయాత్ర గురించి కీలక ప్రకటన చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తన పాదయాత్ర గురించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుంది అని ఆయన చెప్పారు. తాజాగా తాడేపల్లి లో జరిగిన పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో జగన్ మరోసారి ఈ మాట చెప్పారు. వచ్చే ఏడాది అంటే 2027 అన్నది తెలిసిందే. అయితే ఏ నెల నుంచి పాదయాత్ర మొదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు. మరో ఏడాది అని మాత్రం అన్నారు. అంటే 2027 ఆగస్టు నుంచి అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అదే అయితే ఇంకా 12 నెలలు గడవాల్సి ఉంది అని లెక్క వేసుకుంటోంది క్యాడర్. వైసీపీ 2024 ఎన్నికలో ఓటమి చెందాక జగన్ పెద్దగా బయటకు వచ్చింది లేదు, అపుడపుడు పరామర్శ యాత్రలే చేశారు. ఇందులో కూడా ఎక్కువగా తన పార్టీ నాయకులను అరెస్టు చేశారు అన్నదాని మీదనే జగన్ టూర్లు చేశారు. ప్రజా సమస్యల మీద తక్కువ పర్యటనలు చేశారు అని కూడా ఎత్తి చూపుతున్న ప్రత్యర్ధులు ఉన్నారు.
అన్నింటికీ అదేనా :
ఇక జగన్ ప్రసంగాలు చూస్తూంటే ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక సర్వ రోగ నివారిణి అన్నట్లుగా పాదయాత్ర గురించి చెబుతున్నారు. పాదయాత్ర మంచిదే జనంతో మమేకం కావడానికి ఉపయోగపడుతుంది. అయితే జగన్ కొత్త నాయకుడు కాదు, గత 17 ఏళ్ళుగా జనంలో నలిగిన నాయకుడే. అంతే కాదు ఆయన 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక సార్లు పాదయాత్రలు చేశారు. అంతకు ముందు ఓదార్పు యాత్రలు చేశారు. ఇక 2017లో భారీ ఎత్తున 3,700 కిలోమీటర్ల దూరం నడిచి పాదయాత్ర చేశారు. దాని ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఇక అయిదేళ్ళ పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన పాలన ఏమిటి అన్నది కూడా జనాలు చూశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర మళ్ళీ అంటే ఆ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే ఆలోచించాల్సి ఉందనే అంటున్నారు.
సాహసంతో కూడుకున్నదే :
ఒక విధంగా జగన్ గురించి అన్నీ తెలిసిన తరువాత వైసీపీ పార్టీ విధానాలు ప్రభుత్వంగా చేసిన కార్యకలాపాలు అన్నీ జనాలకు పూర్తిగా అర్ధం అయిన తరువాత చేస్తున్న ఈ పాదయాత్ర ఒక సాహసంతో కూడుకున్నదే అని అంటున్నారు. ఇందులో నూఒతనత్వం ఏమిటి అన్న కోణంలో కూడా జనాలు ఆలోచిస్తారు ఇక జెన్ జీ తరం ఆలోచనలు సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న పరిస్థితులలో పదేళ్ల క్రితం జగన్ చేసిన పాదయాత్రతో 2027 నాటి పాదయాత్రను ఏ విధంగాను సరిపోల్చకూడదనే అంటున్నారు. ఈసారి కొత్తగా ఆయన జనం ముందు ఆవిష్కరించబడాలి అంటే చేసే ప్రసంగం నుంచి పార్టీ విధానాలు ఆలోచనలు ఇచ్చే హామీలు అన్నీ కూడా కొత్తగా జనాకర్షణగా ఆచరణాత్మకంగా ఉండాల్సి ఉంటుందని అంటున్నారు. అపుడే జనం మెప్పు పొందుతారు అని కూడా అంటున్నారు.
పార్టీ జనాల సంగతి :
సరే జగన్ నేరుగా జనంలోకి వెళ్ళేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుంది అనుకుంటే వ్యూహాత్మకంగా అది కరెక్ట్ అనే అంటున్నారు. కానీ కేవలం జనంలో క్రేజ్ ఉంటే గెలిచిపోరు కదా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ పటిష్టంగా ఉండాలి. క్యాడర్ లో లీడర్ లో నిబద్ధత అంకితభావం ఉండాలి. ఇది మన పార్టీ రేపటి రోజున గెలిచి తీరాలీ చావో రేవో ఎన్నికల యుద్ధంలో తేల్చుకుంటామని పార్టీ అంతా గట్టిగా నిలబడాలి అంటే అధినాయకత్వం వారికి పూర్తి స్థాయిలో టచ్ లో ఉండాలి కదా అని అంటున్నారు. ఎటూ వచ్చే ఏడాది పాదయాత్ర అని అంటున్న క్రమంలో పార్టీ నేతలకు బూత్ లెవెల్ దాకా ఉన్న క్యాడర్ తో వరస భేటీలను జగన్ వేస్తే మేలు జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా జిల్లాల పర్యటనలకు చేపట్టడం ద్వారా పార్టీ ప్రస్తుత పొజిషన్ ఏమిటి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు వెనకేస్తున్నారు అన్నది కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తాయని అంటున్నారు.
ఆ విమర్శ సహేతుకమైనదేనా :
ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఎక్కడ ఉంటున్నారు అన్నది ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి సంధ్యారాణి అయితే జగన్ తాడేపల్లిలోనా బెంగళూరులోనా ఎక్కడ ఉంటున్నారు అని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తాజాగా విమర్శించారు. ఆమె టీడీపీ మంత్రి కాబట్టి విమర్శించారు అనుకోవడానికి లేదని అంటున్నారు సొంత పార్టీ వారికి జగన్ ఎపుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు అని వైసీపీలో గుసగుసలుగా వినిపిస్తున్న మాట. ఎటూ కూటమి సగం పాలనకు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో జగన్ తాడేపల్లిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ప్రత్యర్ధి విమర్శలకు చెక్ చెప్పవచ్చు. పార్టీ బలోపేతానికి అది మరింతగా దోహదపడుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పాదయాత్ర అని జగన్ అంటూంటే ఎంతెంత దూరం అన్న మాట పార్టీలో వినిపిస్తోంది.