సీఎం విజయ్ పై ఎమ్మెల్యే పొగడ్తలు.. మరి అంతలా వద్దన్న మంత్రి!
తమిళనాడు అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం విజయ్‌ను ఆకాశానికి ఎత్తేయాలని ప్రయత్నించిన ఎమ్మెల్యేకు మంత్రి అదవ్ అర్జున్ షాక్ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం విజయ్‌ను ఆకాశానికి ఎత్తేయాలని ప్రయత్నించిన ఎమ్మెల్యేకు మంత్రి అదవ్ అర్జున్ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని మరీ అంతలా పొగడొద్దు అంటూ ఎమ్మెల్యేకు బ్రేకు వేశారు. సహజంగా రాజకీయాల్లో నేతలు పొగడ్తలకు ప్రాధాన్యమిస్తుంటారని చెబుతుంటారు. అధినేత దృష్టిలో పడేందుకు నేతలు పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అయితే అలాంటి పొగడ్తలకు ముఖ్యమంత్రి విజయ్ పడిపోరంటూ మంత్రి అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సింధు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కీర్తిస్తూ పాట పడగా, మంత్రి జోక్యం చేసుకుని సున్నితంగా మందలించడం హాట్ టాపిక్ అవుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి దళపతి విజయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. మే నెలలో ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. సినీ గ్లామర్ తోపాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయం నమోదు చేసిన విజయ్ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సింపుల్ సీఎంగా ఉండేందుకు ప్రాధాన్యమివ్వడంతోపాటు తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెనువెంటనే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం తీసుకున్న అనేక నిర్ణయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మూడు నెలలుగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చిన సీఎం విజయ్, బుధవారం ఎమ్మెల్యేలకు అనుకోని వరం ఇచ్చారు. ఎమ్మెల్యేలకు సొంత వాహనాలు లేకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడం కష్టంగా ఉందని వీసీకే ఎమ్మెల్యే జోతిమణి అసెంబ్లీలో ప్రస్తావించగా, ముఖ్యమంత్రి దళపతి విజయ్ వెనువెంటనే స్పందించి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వాహనాల నిర్వహణ భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నిర్ణయం ఎమ్మెల్యేలకు ఆనందం కలిగించినట్లు చెబుతున్నారు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికి సొంత వాహనాలు లేవు. అతి సామాన్య నేపథ్యంతో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సొంత వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు కారణంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇతరులపై ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జ్యోతిమణి ద్వారా సమస్య సీఎం దృష్టికి వెళ్లగానే ఆయన స్పందించి ఎమ్మెల్యేలు అందరికీ వాహన యోగం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక సీఎం చేసిన ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ టీవీకే ఎమ్మెల్యే సింధు అసెంబ్లీలో మాట్లాడారు. సీఎం విజయ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంజీఆర్ నటించిన చిత్రంలోని ‘కొడుత్తతెళం కొడుత్తన్’ (ఇచ్చినదంతా ఇచ్చాడు) అనే పాటను సభలో పాడారు. దీంతో అసెంబ్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలతో గంభీరంగా సాగే తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే సింధు పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా, ఈ అంశంపై ముఖ్యమంత్రి దళపతి విజయ్ భిన్నంగా స్పందించారు. ఇలా పొగిడించుకోవడం సరికాదని భావించిన సీఎం విజయ్ మంత్రి అదవ్ అర్జున్ ను రంగంలోకి దింపారని అంటున్నారు. సింధు పాట పాడి తన సీట్లో కూర్చున్న తర్వాత మంత్రి అర్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్‌ని ఎమ్మెల్యేలు అతిగా పొగడటం సరికాదని మందలించారు. ఇలాంటి చర్యలు ముఖ్యమంత్రికి నచ్చకపోవచ్చని, ప్రజాప్రతినిధులు పరిపాలన, క్షేత్రస్థాయి సమస్యలపైనే దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.
దీంతో తమిళనాడు అసెంబ్లీ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి విజయ్ ఒక బలమైన సందేశాన్ని పార్టీ నేతలకు పంపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న విజయ్, 'వ్యక్తి ఆరాధన' కంటే 'పరిపాలనా సంస్కరణలకే' ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారని అంటున్నారు. స్టార్ హీరోగా ఉన్న క్రేజ్‌ను వాడుకుని భజన రాజకీయాలు చేయడం ఆయనకు ఇష్టం లేదని, కేవలం పనితీరు ఆధారంగానే పార్టీ నేతలు గుర్తింపు పొందాలని ఆయన స్పష్టం చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని చెబుతున్నారు.
ముగింపుగా చెప్పాలంటే, విజయ్ తన పరిపాలనలో క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిపాలనలో అనుభవం లేకపోయినా, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. ఎమ్మెల్యేలకు వాహనాల కేటాయింపు వంటి నిర్ణయాలు ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగమే అయినప్పటికీ, దానిని అవకాశంగా తీసుకుని అతిగా పొగడ్తలు కురిపించవద్దని ఆయన తన టీమ్‌కు పంపిన సందేశం, తమిళనాడులో ఒక ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతుందని ఆశిద్దాం.