బీఆర్ఎస్ మీడియాపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ స‌హా.. ఆ పార్టీకి సంబంధించిన ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియాల‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2026-08-19 09:59 GMT

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ స‌హా.. ఆ పార్టీకి సంబంధించిన ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియాల‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అక్ర‌మంగా సంపాయించుకున్న సొమ్ముతో మీడియాను న‌డుపుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌దేళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేశార‌ని.. అక్ర‌మంగా సొమ్ములు పోగేసుకున్నార‌ని అన్నారు. ఇప్పుడు ఆ సొమ్ముతో మీడియాను సృష్టించి.. ప్ర‌జా ప్ర‌భుత్వం (కాంగ్రెస్ స‌ర్కారు)పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యంగా 200ల‌కుపైగా సోషల్ మీడియా ఖాతాల‌ను సృష్టించార‌ని ఆయ‌న ఆరోపించారు.

ప్ర‌జా ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని చూసి ఓర్చుకోలేని ప్ర‌బుద్ధులు స‌ర్కారు పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆ ప్ర‌చారాన్ని న‌మ్మ‌రాద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌న‌కు అక్ర‌మంగా సంపాయించాల‌న్న ఆశ లేద‌ని.. త‌న‌కు ప్ర‌జ‌లే ప్ర‌చార సాధ‌కుల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను మీడియా కంటే ప్ర‌జ‌ల‌నే ఎక్కువ‌గా న‌మ్ముతున్నాన‌ని చెప్పారు. గ‌తంలో జెడ్పీటీసీ నుంచి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వ‌ర‌కు త‌న‌ను ప్ర‌జ‌లే ఆశీర్వ‌దించార‌ని ఆయ‌న తెలిపారు. తాను ఏనాడూ ప్ర‌జ‌ల‌పైనే ఆధార‌ప‌డ్డాన‌ని చెప్పారు.

తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని సీఎం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో రెండున్న‌రేళ్ల‌లో అనేక మార్పులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఒక‌ప్పుడు నిజాంల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన గ‌డ్డ‌.. ఇప్పుడు అక్ర‌మార్కుల‌కు.. కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని.. ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని తానే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాల‌ని సూచించాన‌ని తెలిపారు.

మేమే మ‌ళ్లీ..

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తామే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. 2028లో ఎన్నిక‌లు ఉంటాయ‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ, అలా జ‌ర‌గ‌ద‌న్నారు. 2029లోనే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని.. కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు..త్వ‌ర‌లోనే చేనేత‌, గీత కార్మికుల‌కు సామాజిక భ‌ద్రతా పింఛ‌న్లు ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబంధించి అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చాన‌ని ఆయ‌న చెప్పారు. అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమాన్ని అందిస్తున్న‌ట్టుగానే గౌడ సామాజిక వ‌ర్గాన్ని కూడా ఆదుకుంటామ‌ని తెలిపారు.

Tags:    

Similar News