భవిష్యత్తు AIదే.. డేటా సెంటర్లపై అపోహలను నమ్మకండి : మంత్రి లోకేశ్

రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్ల విషయంలో కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Update: 2026-08-19 08:25 GMT

రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్ల విషయంలో కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విశాఖలో 6.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఆ టార్గెట్ ను చేరుకున్నామని వివరించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటన తర్వాత విశాఖలో పెట్టుబడుల కోసం చాలా పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నా, తాము ఆసక్తి చూపడం లేదని వివరించారు. విశాఖ డేటా సెంటర్ల వల్ల అదనంగా కరెంటు, నీటి వినియోగంపై ఒత్తిడి ఉంటుందనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

చరిత్ర పునరావృతం కాకూడదు

డేటా సెంటర్లపై ప్రజలలో భయాందోళనలు రేకెత్తించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించే సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటనను ఉదహరించారు. 1995లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీని అమలు చేయాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్ ఉద్యోగులకు శిక్షణ ఇప్పించారని ఆ సమయంలో ఒక ఉద్యోగి గుండెపోటుతో మరణిస్తే, అప్పటి విపక్షం రేడియేషన్ కారణంగా మరణించినట్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో ఉద్యోగులు ఆ ప్రచారాన్ని నమ్మకపోవడం వల్ల మన రాష్ట్రం ఐటీలో విప్లవాత్మక మార్పులకు వేదిక అయిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా డేటా సెంటర్లపై అలాంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలం అంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దేనని, ఆ రంగంలో డేటా సెంటర్ల పాత్ర కీలకమని మంత్రి వివరించారు.

స్మార్ట్‌ఫోన్ వెనుక డేటా సెంటర్లు

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారని, ఆ ఫోన్లలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను డేటా సెంటర్లే నిర్వహిస్తున్నాయని లోకేశ్ తెలిపారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం కొనసాగుతున్న తరుణంలో మన దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి కలుస్తున్న నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖకు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై వస్తున్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లకు 3 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, ఈ నీటిని పోలవరం నుంచి తీసుకుంటామని తెలిపారు. పోలవరం నుంచి విశాఖకు తాగునీటితోపాటు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు నీటిని సరఫరా చేస్తామని, పరిశ్రమలకు కేటాయించే నీటిని మాత్రమే డేటా సెంటర్లకు వినియోగిస్తామన్నారు.

అదేసమయంలో అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో నీటి వాడకం మరింత తగ్గనుందని మంత్రి తెలిపారు. మరోవైపు డేటా సెంటర్లకు విద్యుత్ వినియోగంపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు. 'వన్ నేషన్ - వన్ గ్రిడ్' వ్యవస్థ ద్వారా దేశంలో విద్యుత్ సరఫరా సజావుగా సాగుతోందని వెస్టరన్ గ్రిడ్, ఇండియన్ గ్రిడ్ మధ్య తేడాలను వివరించారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీని భారీగా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో 70 శాతం గ్రీన్ ఎనర్జీని డేటా సెంటర్ల కోసం వినియోగించుకుంటామని వివరించారు. ఇక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు కూడా మంజూరు చేశామని వెల్లడించారు.

పెట్టుబడులతో దూసుకుపోతున్న విశాఖ

గూగుల్ పెట్టుబడితో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు పోటీపడుతున్నాయని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించుకున్న 6.5 గిగావాట్ల లక్ష్యానికి మించి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం లేదని, నిర్దేశిత టార్గెట్ రీచ్ అయ్యామని స్పష్టం చేశారు. ఏనాడూ ప్రజా సమస్యలపై మాట్లాడని వారు ఇప్పుడు విశాఖలో ధర్నాలు చేయడం సరికాదన్నారు. మొత్తంగా డేటా సెంటర్ల ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇవి రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతో దోహదపడతాయని మంత్రి లోకేశ్ తేల్చిచెప్పారు.

Tags:    

Similar News