'సత్య నాదెళ్ల- రిచర్డ్ బ్రాన్సన్-వారెన్ బఫెట్' సక్సెస్ వెన‌క టాప్ సీక్రెట్స్

నేటి అధునాతన ఒత్తిళ్ల ప్ర‌పంచంలో అత్యుత్త‌మ వ్యాపార దిగ్గజాలు అనగానే మనకు నిరంతర శ్రమ.. క్షణం తీరిక లేని పని మాత్రమే గుర్తుకొస్తాయి.

Update: 2026-08-19 04:29 GMT

నేటి అధునాతన ఒత్తిళ్ల ప్ర‌పంచంలో అత్యుత్త‌మ వ్యాపార దిగ్గజాలు అనగానే మనకు నిరంతర శ్రమ.. క్షణం తీరిక లేని పని మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ వినూత్న త‌ర‌హాలో విజయాలను సాధించిన వారెవరూ కేవలం ఒకే రంగానికి పరిమితమై `24/7 గ్రైండింగ్`(నిత్యం న‌లిగిపోవ‌డం) మోడ్‌లో బ్రతకలేదు. సత్య నాదెళ్ల- రిచర్డ్ బ్రాన్సన్-వారెన్ బఫెట్ వంటి నాయకుల విజయం వెనుక వారి వృత్తిపరమైన నిర్ణయాలు ఎంత ఉన్నాయో.. వారి వ్యక్తిగత వ్యాపకాలు (హాబీస్) కూడా అంతే కీలక పాత్ర పోషించాయి. నేటి నవతరం వ్యాపారవేత్తలు- ఉద్యోగులు ఈ ముగ్గురి జీవన విధానం నుండి సరికొత్త మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు.

మొదటిగా మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు వ్యాపార‌వేత్త‌ సత్య నాదెళ్ల జీవితం నుండి నేటితరం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం `సానుకూల‌త‌తో కూడిన నాయకత్వం`. క్రికెట్ ఆటపై తనకున్న మక్కువనే తన నాయకత్వ శైలిగా మలుచుకున్నారాయన. ఆటలో వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. తోటి ఆటగాళ్లలోని ప్రతిభను బయటకు తీయడమే అసలైన కెప్టెన్సీ అని నాదెళ్ల నమ్ముతారు. కేవలం టెక్నాలజీ నైపుణ్యాలే కాకుండా.. ఒక బృందాన్ని ఎలా నడిపించాలో... ఇతరులకు ఎలా మద్దతుగా నిలవాలో తెలుసుకోవడం నేటి కార్పొరేట్ యుగంలో అత్యంత ఆవశ్యకమని ఆయన నిరూపించారు.

రెండవది.. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ శైలి `శారీరక, మానసిక ఉత్సాహాల సమతుల్యత`ను తెలియజేస్తుంది. నిరంతరం వ్యాయామం చేస్తూ అడ్వెంచ‌ర్ గేమ్స్ లో పాల్గొనడం వల్ల సమయం వృధా కాదని.. అది మనలో ఉత్సాహాన్ని -ఎన‌ర్జీని రెట్టింపు చేస్తుందని ఆయన నిరూపించారు. శారీరక దృఢత్వం మానసిక స్పష్టతను ఇస్తుందని.. ఆ స్పష్టతే క్లిష్టమైన వ్యాపార నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి దోహదపడుతుందని బ్రాన్సన్ జీవితం చెప్తుంది. అన్ లిమిటెడ్ గా టైమ్ సెన్స్ లేకుండా అలసిపోయే వరకు పనిచేయడం కంటే.. నూతన ఉత్తేజంతో పనిచేయడమే నిజమైన ఉత్పాదకత అని నేటి యవత గ్రహించాలి.

మూడవది ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అందించే సందేశం ``పరిస్థితులకు అనుగుణంగా మారే మానసిక పరిణతి``. బఫెట్ `బ్రిడ్జ్` అనే పేకాటను ఎంతో ఇష్టంగా ఆడతారు. కొత్త సమాచారం వచ్చినప్పుడు.. దానికి తగ్గట్టుగా వేగంగా వ్యూహాన్ని మార్చుకోవడమే ఈ ఆటలోని అసలైన సూత్రం. పెట్టుబడుల ప్రపంచంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఎంత పెద్ద ప్లాన్ ఉన్నా పరిస్థితులు మారినప్పుడు మొండిగా ఉండకుండా.. కొత్త డేటాకు అనుగుణంగా తమ నిర్ణయాలను సవరించుకునే మానసిక పదును నేటి డిజిటల్ యుగంలో చాలా అవసరం.

ముగింపుగా.. పరిశోధనలు సైతం నిరూపిస్తున్న సత్యం ఏమిటంటే.. కేవలం ఒకే పనిపై అనుక్షణం దృష్టి పెట్టే వారికంటే.. విభిన్న‌మైన ర‌క‌ర‌కాల‌ ఆసక్తులు ఉన్నవారే అత్యున్నత రంగానికి చేరుకుంటారు. శాస్త్రవేత్తలైనా. క్రీడాకారులైనా... వ్యాపారవేత్తలైనా... తమ ఆసక్తులను విస్తరించుకున్నప్పుడే నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాబట్టి నేటితరం `కేవలం శ్రమించడం` మాత్రమే కాకుండా.. మైండ్ రీఫ్రెష్ అయ్యే వ్యాపకాలను పెంపొందించుకుంటూ.. సమగ్రమైన వ్యక్తిత్వంతో విజయం వైపు సాగడమే అసలైన విజయ రహస్యం.

Tags:    

Similar News