వైసీపీ క్యాడర్ గెలిచింది....మరి లీడర్ ?

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు వద్దే వద్దు అని జగన్ ఒకటికి పది సార్లు చెప్పారు. ప్రతీ సీటులో వైసీపీ జెండా ఎగరాలని పోటీ చేసి తీరాల్సిందే అని స్పష్టం చేశారు.

Update: 2026-10-29 16:30 GMT

వైసీపీ అధినాయకత్వం లోకల్ బాడీ ఎన్నికలను క్యాడర్ లో కసి పెరగడానికి ఒక అవకాశంగా తీసుకుంది అని అంటున్నారు. ఆ మేరకు వైసీపీ వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికలను భావించింది. నిజానికి మొదట్లో చాలా ప్రచారం సాగింది. వైసీపీ స్థానిక ఎన్నికల పోరు నుంచి తప్పుకుంటుంది అని కూడా భావించారు. ఎన్నికలను బహిష్కరిస్తారని ఎటూ అధికార పార్టీకే జనాలు ఈ ఎన్నికల్లో మొగ్గు చూపిస్తారు కాబట్టి ఫలితాలు ఆశించిన స్థాయిలో వచ్చేది ఉండదు కాబట్టి ఎందుకొచ్చిన తలనొప్పి అని ఆలోచిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఆ ఊహాగానాలు అలా సాగుతుండగానే వైసీపీ అధినేత జగన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కి రెండు ముండు నెలల ముందు కూడా పార్టీ సమావేశాలు నిర్వహించి మరీ నేతలందరికీ దిశా నిర్దేశం చేశారు.

ఏకగ్రీవాలు వద్దు :

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు వద్దే వద్దు అని జగన్ ఒకటికి పది సార్లు చెప్పారు. ప్రతీ సీటులో వైసీపీ జెండా ఎగరాలని పోటీ చేసి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. దాంతో వైసీపీ నేతలలో ఎంత వేడి పుట్టిందో తెలియదు కానీ క్యాడర్ లో మాత్రం హీట్ బాగానే రాజుకుంది. దానికి ఉదాహరణగా అనేక చోట్ల నామినేషన్ పర్వంలో క్యాడర్ ఎదురొడ్డి పోరాడింది. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వచ్చి అధికార కూటమితో తలపడ్డారు. చాలా చోట్ల ఘర్షణలు జరగడానికి వైసీపీ కార్యకర్తలు చూపించిన దూకుడుతో కూడిన కసి కారణం అని కూడా వుంది. ఒక విధంగా తమ పార్టీ జెండాను నిలపాలన్న పట్టుదలతో వారు పనిచేశారు అని అంటున్నారు.

ఇంత చేసినా :

అయితే క్యాడర్ తాము చేయాల్సింది చేసింది. అయితే స్థానికంగా వారికి నాయకులు ఏ మేరకు కలసి వచ్చారు అన్నది మరో చర్చ. అదే సమయంలో వ్యూహాత్మకంగా వైసీపీ ఎన్నికల వేళ ఎంత వరకూ వ్యవహరించింది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఇక వైసీపీ క్యాడర్ కి తోడుగా ఉండాల్సిన అధినాయకత్వం ఏ మేరకు సహకారం అందించింది అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. వైసీపీ న్యాయ పోరాటాలు చేసింది. అంత వరకూ మెచ్చుకోవాల్సిందే. అయితే అది సమయానికి చేసిందా అన్నది కూడా ప్రశ్న. నామినేషన్ల దాఖలు చివరి రోజున కోర్టులలో పిటిషన్లు దాఖలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది అని అంటున్నారు.

చాన్స్ దక్కినా :

ఇక చూస్తే ఒక దశలో సుప్రీంకోర్టు వైసీపీ పిటిషన్ మీద కొంత అనుకూలంగా స్పందించింది. నామినేషన్లు దాఖలు చేయని వారివి తిరిగి తీసుకోవాలని రీ నామినేషన్ ప్రక్రియకు గడువు పెంచాలని సూచించింది. దీంతో జాతీయ మీడియా కూడా ఏపీ స్థానిక ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఈ కీలక దశలో వైసీపీ జాతీయ స్థాయి మీడియాను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయలేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అధినాయకత్వం అక్కడ ఏపీలో తమకు ఏమి అన్యాయం జరిగింది అన్నది వివరించి ఉంటే కనుక కచ్చితంగా వేరే విధంగా ఉండేది అన్న భావన పార్టీలో ఉంది. కానీ అలా జరగలేదు, ఎంతసేపూ 2029లో మేము అధికారంలోకి వస్తాం, అపుడు చూసుకుంటామని చెప్పడమే తప్ప ప్రస్తుతం ఉన్న అవకాశాలను ఏ మేరకు వాడుకోవాలన్నది ఒక స్ట్రాటజికల్ గా వైసీపీ చేయలేకపోయిందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు.

కార్యకర్తలదే :

ఇక స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఫలితాలు ఎలా ఉన్నా వైసీపీలో ఎంతో కొంత వేడి పుట్టింది అంటే దానికి అక్షరాలా కార్యకర్తలే కారణం అని అంటున్నారు. వారికి పార్టీ జెండా మీద ప్రేమ ఉంది. గట్టి సంకల్పం ఉంది. వారిలో ఆవేశాన్ని అనుకూలంగా చేసుకుని అధినాయకత్వం వ్యూహాత్మకంగా మరింత సమర్థంగా పనిచేయాల్సి ఉందని కూడా అంటున్నారు. అలాగే స్థానికంగా నాయకులు కూడా కార్యకర్తల ఫైర్ లో చాలా వరకూ తామూ ప్రదర్శించి ఉంటే వైసీపీ పోరాటం వేరే లెవెల్ లో ఉండేది అన్న మాట కూడా ఉంది అంటున్నారు.

Tags:    

Similar News