మొన్న నాగార్జున.. నేడు కేటీఆర్ పై.. కొండా సురేఖకు సడెన్ గా ఏమైంది?

అధికారాంతమున అన్నీ అర్థమవుతాయంటారు.. తప్పులు అందరూ చేస్తారు.. కానీ అవి సరిదిద్దుకునేందుకు అవకాశం చాలా లేటవుతుంది.

Update: 2026-10-29 10:09 GMT

అధికారాంతమున అన్నీ అర్థమవుతాయంటారు.. తప్పులు అందరూ చేస్తారు.. కానీ అవి సరిదిద్దుకునేందుకు అవకాశం చాలా లేటవుతుంది. అప్పటికీ చేసుకుందామన్నా.. సమయం.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది.. తెలంగాణ మంత్రిగా కొండా సురేఖకు గతంలో దక్కిన గౌరవం.. పరపతి.. రేవంత్ వద్ద బీసీ మహిళా మంత్రిగా కీర్తి అన్నీ ఇన్నీ కావు. అయితే ఒక్క తప్పు.. అదీ ఆమె చేసింది కాదు.. అయినా ఆమె పదవికి ముప్పుతెచ్చింది. కూతురు తప్పును సరిదిద్దక.. వెనకేసుకు రావడం మంత్రి సురేఖ పదవికి ఎసరు తెచ్చింది..

సురేఖ మొదటి నుంచి ఒక ఫైర్ బ్రాండ్.. తెలంగాణలో ఆమె మాట్లాడితే ప్రత్యర్థులందరూ వణకాల్సిందే. అంతలా వాగ్ధాటి ఆమె సొంతం. అయితే ముందునుంచి ఆ మాటల మంత్రమే ఆమెను తెలంగాణలో ఒక ఫైర్ నేతగా మార్చింది. రాజకీయ నేతగా నిలబెట్టింది.

నాడు వైఎస్ఆర్ కు అండగా కాంగ్రెస్ లో వెలిగిన ఆమె.. అనంతరం ఆమె కుమారుడు జగన్ కు అండగా నిలిచి తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అన్న మాట కోసం జగన్ వెంట నడిచి రాళ్లు వేయించుకున్నా వెనక్కి తగ్గలేదు.

ఇక రాష్ట్రం విడిపోయాక బీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్ గా మారి.. అదే దుందుడుకు తనంతో బయటకెళ్లిపోయారు. కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి సంపాదించి ఇక్కడ కూడా అదే స్వభావంతో కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈసారి ఆమె పదవికి చేతు తెచ్చింది మాత్రం ఆమె కూతురు వల్ల.. సీఎం రేవంత్ పై ఆమె కూతురు చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. అధిష్టానం ఆగ్రహానికి గురై చివరకు సురేఖ మంత్రి పదవి పోయేలా చేశాయి.

అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు సురేఖ గతంలో హీరో నాగార్జునపై, అక్కినేని కుటుంబంపై ‘సమంత-నాగచైతన్య’ విడాకుల విషయంలో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. చివరకు నాగార్జునకు, అక్కినేని కుటుంబానికి సారీ చెప్పినా.. ఆమె మాటల వేడి తగ్గలేదు. కోర్టు కేసుల వరకూ వెళ్లాయి..

తర్వాత కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. ఆయన కోర్టుకెళ్లారు. కాంగ్రెస్ మంత్రిగా ఆమె చేసిన మాటలు జాతీయ స్థాయి వరకూ వెళ్లి అప్రతిష్ట పాలు చేశాయి.

ఈ రెండూ వివాదాల్లోనూ సురేఖ హద్దులు దాటేసింది. ఇప్పుడు మంత్రి పదవి పోయాక చాలా రోజులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత కామెంట్లకు కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొండా సురేఖ తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ.. వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను ’’ అంటూ బాధపడ్డారు.

కొండా సురేఖ వ్యాఖ్యలతో చేసిన డ్యామేజ్ అంతా ఇంతాకాదు.. ఈ పశ్చాత్తాపం అప్పుడు మంత్రిగా పడి ఉంటే సానుభూతి దక్కేదని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పూర్తి డ్యామేజ్ జరిగి మంత్రి పదవి పోయి.. అప్రతిష్ట పాలై.. కాంగ్రెస్ నుంచి బయటకు వెళదామన్నా.. తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీల్లో దారులు మూసుకుపోయిన తరుణంలో కొండా సురేఖ చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు పశ్చాత్తాపడ్డ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నేతలుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి.. ఎంత జాగ్రత్తగా లేకపోతే కెరీర్ కు ఎంత ప్రమాదమన్నది కాలమే సమాధానం చెప్తుంది. అందుకే కొన్ని విషయాల్లో నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు నొక్కి చెబుతున్నాయి.



Tags:    

Similar News